Friday, February 3, 2023

శ్రీ కాళహస్తీశ్వర శతకం

41. పవమానాశనభూషణప్రకరముల్, భద్రేభచర్మంబు, నా
టవికత్వమ్ము( బ్రియంబులైభుజగశుండాలాటవీచారులన్
భవదుఃఖంబుల( బాపుటొప్పు( జెలదింబాటించి కైవల్య మి
చ్చి వినోదించుట కేమికారణమయా? శ్రీ కాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీ కాళహస్తీశ్వరా!పవమాన – అశన -గాలి భోజనముగా గల పాముల, భూషణ ప్రకరముల్ -ఆభరణములును, భద్ర – ఇభ – చర్మంబున్ – శ్రేష్ఠమైన భద్రము అనే జాతికి చెందిన ఏనుగ చర్మమును, ఆటవికత్వమ్మున్- కిరాతత్వమును, ప్రియములు – ఐ – ఇష్టములైనవి కాగా,(ఇష్టములైనందు వల్ల), భుజగ – పాము, శుండాల ్స ఏనుగ, అటవీచారులన్ – కిరాతులకు, భవదుఃఖంబులన్ – సంసారబాధలను, పాపుట -తొలగించటం, ఒప్పున్ – తగియున్నది, కాని – కాని, చెలదిన్ – సాలె పురుగును, పాటించి – పెద్దగ పరిగణించి, (లెక్కలోనికి తీసుకుని, అగ్రస్థాన మిచ్చి), కైవల్యము -ఇచ్చి- మోక్షమును ప్రసాదించి, వినోదించుటకు – ఆనందించటానికి, ఏమి కారణము – అయ్యా! – నిమిత్త మేమిటయ్యా?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నీకు పాముల నగలన్నా, గజచర్మం అన్నా, కిరాతవేషం అన్నా ఇష్టం కనుక పాముకి, ఏనుగకి, కిరాతకుడైన తిన్నడికిభవబంధాలు తొలగించి, మోక్ష మిచ్చావు. బాగానే ఉంది. కాని, ఒక సాలెపురుగుని గొప్ప చేసి, దానికి మోక్ష మిచ్చి, వినోదిస్తున్నావు. దానికి కారణం తెలియటం లేదు.
విశేషం: సరీసృపాలకి, జంతువులకి, ఆటవికులకి మోక్షం ఇవ్వటానికి వాటిపై గల ఇష్టం కారణం అనచ్చు. ఒక పురుగుకి మోక్షం ప్రసాదించటం అంటే ఎంత దయామయుడై ఉండాలి శివుడు? శివుడు సర్వజీవులనుసమభావంతోకాపాడుతాడనటానికి నిదర్శనం.
అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు శివుడాతణ్ణి పరీక్షించటానికి కిరాతవేషంలో వెళ్ళిన ఇతివృత్తాన్ని స్ఫురణకు తీసుకు వచ్చాడు ఈ పద్యంలో.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement