Tuesday, May 7, 2024

శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌ర శ‌త‌కం..

  1. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచు న్మహాబంధనం
    బేలా నా మెడ గట్టినాడ విక నిన్నే వేళ జింతింతు, ని
    ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలో గ్రుంకి యీ
    శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! ఆలున్- భార్యయు, బిడ్డలు- సంతానము, తల్లితండ్రులు- జనని జనకులు, ధనము- సంపద, అంచు- అనుచు, అంటూ, మహా-గొప్ప, బంధనంబు- ముడి, నా మెడకున్- నా కంఠానికి, కట్టినాడవు-కట్టావు. మనంబులోన్- మనసులో, నెగడు-వృద్ధి అవుతున్న, నిర్మూలంబు- ఐన- అకారణమైన ( అకారణంగా వృద్ధి అవుతున్న) దుర్మోహ- అబ్ధిలో- చెడ్డదైన విషయ వ్యామోహము అనే సముద్రం లో , క్రుంకి- మునిగి యుండి, ఇంక- ఇటుపై, నిన్ను- నిన్ను, ఏ వేళన్- ఏ సమయంలో, చింతింతున్- స్మరించ గలను? ఈ శీలామాలపు- ఈ భరింపరాని, చింతన్ ్స డుఃఖాన్ని, ఎట్లు- ఏ విధంగా, ఉడిపెదు- ఓ- పోగొడతావో ?
    తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! భార్యాపుత్రులు, తల్లితండ్రులు, ధనము మొదలైన పెద్ద పెద్ద బంధాలని నా మెడకు చుట్టినా వెందుకు? ఆ బంధాల వలన అకారణంగా పెరిగి పోతున్న చెడ్డదైన విషయ వ్యామోహమనే సముద్రంలో మునిగి పోయి ఉన్నాను. అలా మునిగి ఉన్న నేను నిన్ను ఏ సమయంలో ధ్యానించ గలను?ఈ భరింప రాని డుఃఖాన్ని ఎలా పోగొడతావో?
    విశేషం: నిజమైన బంధనాలు ఆలుబిడ్డలు, తల్లి తండ్రులు, ధనము కాదు. వాటిపై మానవులు పెంచుకున్న వ్యామోహమే బంధము. జన్మ మెత్తిన తరువాత నిరసించ వలసినది సంబంధాలని కాదు. వాటిపై పెంచుకున్న అక్కఱ లేని వ్యామోహాన్ని. ఈ వ్యామోహంలో పడి భగవన్నామ స్మరణను వదిలేయటం జరుగుతుంది. అసలు దుఃఖం అది.
    “ విపది స్మరణం శంభోః స్మరణం సర్వసంపదః” – అంటే శివుణ్ణి మరచి పోవటమే దుఃఖం, తలచుటే మహదైశ్వర్యం అని అర్థం.
    రెండూ చింతలే. లౌకిక విషయాలపై చింత పోతే మిగిలేది ‘ శివుడి చింత’ యే.
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement