Monday, April 29, 2024

సమతా కుంభ్ – 2023 మహోత్సవం..

ఈ రోజు ప్రాతఃకాలంలో ఆచార్య సన్నిధిలో పెరుమాళ్ల ఆరాధన, సేవాకాలం, మంగళాశాసనములు, శాంతి పాఠం, వేద విన్నపాలు, వేద పారాయణములు వరుసగా కొనసాగాయి.

సమతాకుంభ్‌ 2023 బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరిరోజు కలశ తీర్థాన్ని తీసుకెళ్లి దివ్యసాకేత క్షేత్రంలోని వైకుంఠనాథుడు, రంగనాథుడు, రఘునాథుడు, ఆంజనేయస్వామి, ఆళ్వార్లకు ప్రోక్షణ జరిపించారు. మూలమూర్తికి ఉత్సవాన్త స్నపనము నిర్వహించారు. ఆ తర్వాత యాగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసిన దేవతాగణానికి పూజా కార్యక్రమాలు జరిపించారు. రంగురంగుల పుష్పాలతో చక్ర మండల రచన చేసి శ్రీపుష్ప యాగం ఘనంగా నిర్వహించారు. శ్రీ చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ద్వాదశ ఆరాధన కార్యక్రమం జరిగింది. పుష్పాలతో వరుసగా 12 ఆరాధనలు చేశారు. ఇలా సుప్రభాతంనుంచి శయనోత్సవం వరకు 12 సార్లు ఆరాధనలు జరిపించారు. అనంతరం పెరుమాళ్లను యాగశాలకు తీసుకొచ్చి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఇదే చివరి ఆహుతి అని శ్రీ చినజీయర్‌ స్వామి అన్నారు. ఆవాహన చేసిన దేవతలందరికీ ఆరాధన చేసి బలిహరణలు పూర్తయ్యాక దేవతా ఉద్వాసన చేశారు. కార్యక్రమం మొత్తాన్ని నడిపించిన గరుడ్మంతుడి దగ్గరికి వెళ్లి స్వామి ఆజ్ఞతో వారిని కిందకి దించుతారు. గరుడ పటాన్ని శ్రీ చినజీయర్‌స్వామి అవరోహణం చేశారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. చివరిగా ఆవాహన చేసిన దేవతలందరినీ కలశంలో వేంచేయింపజేశారు. దేవతలతో ఆవాహన చేసుకోబడిన కుంభాన్ని, యజ్ఞ శేషాన్ని 108 దివ్యదేశాల్లో ఉండే స్వాములకు యజ్ఞరక్ష పెట్టి కుంభతీర్థంతో ప్రోక్షణ జరిపించారు. తర్వాత స్వర్ణ రామానుజులవారి దగ్గర, సమతా మూర్తి దగ్గర ప్రోక్షణ కార్యక్రమం జరిగింది. ప్రోక్షణ తర్వాత ఆ శేష తీర్థాన్ని భక్తులకు అనుగ్రహించారు. ఈ ద్వాదశ ఆరాధన కార్యక్రమంలో 12 ప్రసాదాలు నివేదించారు. అనంతరం ప్రసాదాన్ని భక్తులకు అనుగ్రహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement