Tuesday, May 14, 2024

ప్రశాంత జీవనానికిసాధనా మార్గం

”ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య: పరం మన:
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు స:”
(భగవద్గీత 3 వ అధ్యాయం ( కర్మయోగం) 42 వ శ్లోకం)

జడ ఓదార్ధం కంటే ఇంద్రియములు ఉత్తమమైనవి. ఇంద్రియాల కంటే మనస్సు ఉత్తమం. మనస్సు కంటే బుద్ధి, ఆ బుద్ధి కంటే ఆత్మ అత్యుత్తమమని గీతాచార్యుడు బోధిస్తున్నాడు.
ఇంద్రియాలు మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తంగా ఉన్నప్పటికీ అవి కామ సం బంధిత కర్మలకు ద్వారాలుగా వున్నందున అవి ఎంతో బలవత్తరమైనవి మరియు జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి.
పవిత్రమైన కామం (కోరికలు) సిద్ధించుకోవదం తప్పుకాదు కాని అపవిత్రమైనవి, అధర్మ మైన వాటిని తీర్చుకోవాలనుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. కాని ఇంద్రియాలను నియంత్రణ లో వుంచుకోకపోతే, అవి చిత్తం వచ్చినట్లు పరుగులు తీసి మానవులు వాటి సాధనలో విచక్షణ ను కోల్పోయేటట్లు చేస్తాయి. ఇది మానవులను చివరకు పతనావస్థకు దిగజారుస్తుంది.
అయితే ఇంద్రియాలను నిరోధించేందుకు దేహ కర్మలను ఆపివేయడం తగదు. శరీరం ఎలాంటి కర్మలు చేయకుండా నిశ్చలంగా వుంచినా, క్రియాశీలత వున్న మనస్సు చంచలమ వుతూ మనవులను తీవ్ర కలతకు గురిచేస్తుంది. దీనికి విరుగుడు మనస్సు కంటే ఉన్నతమైనదైన బుద్ధిని మన నియంత్రణలో వుంచుకొని బుద్ధి పూర్వకంగా, బలవంతంగానైనా మన కర్మలను భగవంతుని సేవలో వినియోగించాలి. అప్పుడు ఇంద్రియాలు అటుఇటూ సంచరించకుండా నియంత్రణలోకి వస్తాయి. ఈ విధానాన్ని క్రమశిక్షణతో కనీసం 40 రోజులపాటు అభ్యసిస్తే మనస్సు సైతం కొంతకాలానికి మన నియంత్రణలోకి వస్తుంది. మనస్సు భగవత్‌ సేవ వైపు స్థిరంగా మళ్ళగలిగితే అది నిత్యం, సత్యం అయిన శాశ్వతానందానికి దారి తీస్తుంది. నిత్య జీవి తంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు దుఖాలు, బాధలు వంటివి మనలను ఏం చెయ్యలేక తోక ముడుస్తాయి. మనస్సు వీటన్నిటికీ అతీతంగా వుండే స్థితికి చేరుతుంది. ఈ స్థితినే స్థితప్రజ్ఞత అని భగవద్గీత బోధిస్తోంది.
అందుకే బుద్ధి చేతనే మనస్సు నియంత్రణలోకి రావడం సాధ్యం. భగవంతుని యందు సం పూర్ణ శరణాగతితో మానవుడు తన బుద్ధితో మనస్సును ఆయన యందు నిష్కల్మషమైన భక్తి భావన యందు నిలిపితే మనస్సు అప్రయత్నంగానే దృఢవంతమౌతుంది.ఆ స్థితిలో ఎంతటి బలవత్తరమైన కోరికలైనా సరే అతడిని ఏమీ చెయ్యలేక తోక ముడిచి పారిపోతాయి. మనస్సు ప్రశాంత సరోవరంగా మారిపోయి తాత్కాలికంగా సరోవరంలోకి విసిరిన రాయి కొద్దిపాటి అలజడిని సృష్టించి, త్వరగా యథాస్థితికి వచ్చినట్లు సమస్యల అలజడులు కూడా త్వరగా సమసిపోయి మనస్సు యధార్ధ స్థితి అయిన ప్రశాంతతకు తిరిగి వచ్చేస్తుంది. ప్రశాంత జీవనానికి ఈ సాధనే అత్యుత్తమం. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ నిత్యం చిత్తశుద్ధితో, క్రమ శిక్షణ తో, భగవద్‌ భక్తితో సాధన చేసేవారు బుద్ధి చేత మానవుడు ఆత్మ నిజ స్థితిని తెలుసుకొని తద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు.
– చెరుకూరి 98660 71785

Advertisement

తాజా వార్తలు

Advertisement