Sunday, May 19, 2024

విశ్వ‘నిర్మల ధర్మ’రూపమే మాతాజీ నిర్మలాదేవి.. మార్చి 21 నుంచి ఏడాదిపాటు శతజయంత్యుత్సవాలు

కరోనానంతర పరిస్థితుల్లో ఆధ్యాత్మికత, యోగ, ధ్యానం లను అలవర్చుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. ఉరుకులు, పరుగుల జీవితంలో ఒక నిమిషం ఆగినా ఎంతో వెనకబడిపోతామనుకుంటున్న పరిస్థితుల నుంచి.. సంపూర్ణారోగ్యం, ఆత్మసాక్షాత్కారం, ఆధ్యాత్మికత,యోగ, ధ్యానం వంటి వాటి వైపు యావత్ ప్రపంచం దృష్టిపెడుతోంది. వాస్తవానికి భారతదేశం ప్రాచీన కాలం నుంచే వివిధ అంశాల్లో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ వస్తోంది.  భారతదేశ ఔన్నత్యాన్ని, మన సంస్కృతి, సంప్రదాయాల్లోని విలువైన మహత్తును విశ్వవ్యాప్తం చేసేందుకు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వంటి ఎందరో మహానుభావులు ముందుడి నడిపించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అలాంటి అద్భుతాల పరంపరలో ఒకరు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు.

‘సహజ యోగ’ విధానాన్ని భారతీయ సమాజంతోపాటు యావత్ ప్రపంచానికి పరిచయం చేసి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలనుంచి ప్రపంచం బయటపడినపుడే మానవాళి పురోగతి సాధ్యమవతుందని, అన్ని సమస్యలు తొలగిపోయి ‘ఆత్మసాక్షాత్మారం’ ద్వారా పరమావధి లభిస్తుందని వారు బోధించారు. 

ప్రపంచాన్ని సృష్టించిన శక్తితో మనం అనుసంధానించబడనంతవరకు జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేమని ఆమె అంటారు. దీన్నే ఆత్మ సాక్షాత్కారం (SELF REALISATION) అని చక్కగా వివరించారు. యోగం అంటే యోగాసనాలు, ప్రాణాయామం మాత్రమే కాదని, యోగం అంటే మీరు విశ్వసించే సర్వవ్యాపితుడైన భగవంతునితో అనుసంధానం చేసుకోవడమనే వాదనను సమర్థవంతంగా వినిపించి అందరినీ ఒప్పించారు. ఇదే ‘విశ్వ నిర్మల ధర్మం’ అని చాటిచెప్పారు. ఇందుకోసం శరీరంలోని కుండలినీ శక్తిని జాగృత పరుచుకోవాల్సిన అవసరాన్ని ఇందుకు ‘సహజయోగ’ ఏవిధంగా ఉపయుక్తం అవుతందనే విషయాన్ని నిరూపితం చేశారు. భారత్, అమెరికా, యూరప్, ఆఫ్రికాతోపాటుగా 120 దేశాల్లో.. కుల,మత, జాతి వివక్షల్లేని ప్రపంచ నిర్మాణం కోసం విశ్వమానవాళి శ్రేయస్సుకోసం సుస్థిరమైన శాంతి స్థాపనకోసం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అహర్నిషలు కృషిచేశారు. భారతదేశంలోనూ గ్రామగ్రామాల్లో కాలినడకన, ఎడ్లబండ్లపైన ఊరూరా తిరుగుతూ సహజయోగ విధానాన్ని, శాంతిసామరస్యాల ప్రాధాన్యతను ప్రచారం చేశారు. ఆ మహనీయురాలి శతజయంతి సందర్భంగా వారి గురించిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1923 మార్చి 21న మధ్యప్రదేశ్ లోని చింద్వారా గ్రామంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి జన్మించారు. వీరి తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులే. దేశ స్వాతంత్ర్యం కోసం యావదాస్తినీ త్యాగం చేశారు. ఇలాంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి లాహోర్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతూనే స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి ‘సర్’ చంద్రికా ప్రసాద్ శ్రీవాత్సవను వివాహం చేసుకున్నారు. చిన్నప్పటినుంచే బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న ఆమె, ప్రపంచంలోని అన్ని మత  గ్రంథాల సారాన్ని, అందులోని జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు.

భర్త ఉద్యోగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ప్రపంచ పరిస్థితులను తెలుసుకునేందుకు శ్రీ మాతాజీ నిర్మాలాదేవి గారికి వీలు కలిగింది. వివిధ దేశాల్లోని వివిధ పరిస్థితులు, సమస్యలు, వివిధ రకాల వివక్షల కారణంగా మనుషుల్లో పెరుగుతున్న స్వార్థ, ద్వేష భావనలు చూశారామె. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలతో ఉన్నఅనుబంధం కారణంగా చిన్నప్పటినుంచే యోగ, ధ్యానం వంటి వాటిపై ఆసక్తి ఉండేది. అయితే, 1970వ దశకంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు గుజరాత్ లోని నార్గోల్ సముద్ర తీరంలో ధ్యానంలో ఉండగా ‘సహజయోగ’కు సంబంధించిన అనుభూతిని పొందారు. భగవంతుడితో అనుసంధానమయ్యేందుకు ఇదే అత్యంత అనుకూలమైన, శక్తివంతమైన మార్గంగా భావించిన ఆమె.. ఈ ‘సహజయోగ’ను ప్రపంచానికి తెలియజేసేందుకు కంకణం కట్టుకున్నారు. ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ జీవన విధానాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తుచేయడంతోపాటు ‘ద్వేషరహిత, ప్రేమపూరిత సమాజ’ నిర్మాణానికి నడుం బిగించారు.

- Advertisement -

ఎలాంటి రుసుము తీసుకోకుండానే, పేద, ధనిక అనే తేడాల్లేకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల స్థాపన ద్వారా ‘ధర్మసంస్థాపన’ కోసం పనిచేశారు. ప్రతిఫలాపేక్ష, స్వార్థ చింతన లేకుండా తాను కూడబెట్టుకున్న దాన్ని, భర్త సంపాదనను ఖర్చుచేస్తూ ‘సహజయోగ’ను విశ్వవ్యాప్తం చేశారు. సమస్త మానవాళిలో పరస్పర ప్రేమానురాగాలు, ఆప్యాయత, సౌభ్రాతత్వం వంటివి అవసరమని ఇందుకోసం శాంతి, సామరస్యాలతో కూడిన సమాజం అవసరమని ఉద్బోధించారు.

ఆధ్యాత్మికత, యోగకే పరిమితం కాకుండా, మానవాళి మనుగడలో వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు వ్యవసాయ రంగంలోనూ మార్పులు తీసుకురావడానికి ‘సహజకృషి’ పద్ధతులను తీసుకొచ్చారు. భారతీయ విధానాలను విశ్వవ్యాప్తం చేయడంతోపాటు, ప్రపంచాన్ని శాంతిమార్గంలో తీసుకెళ్లేందుకు అహరహం శ్రమించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఆ మహనీయురాలి శతజయంతి సందర్భంగా ‘శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్టు’ ఆధ్వర్యంలో 21 మార్చి 2022 నుంచి మార్చి, 21, 2023 వరకు శతజయంత్యుత్సవాలను ఘనంగా జరపనున్నారు. ఆత్మసాక్షాత్మారానికి, సంపూర్ణ ఆయురారోగ్య సాధనకోసం యావత్ సమాజానికి ఉచితంగా సహజయోగ శిక్షణను అందించనున్నాను. మరీ ముఖ్యంగా మన మహిళామణుల సామర్థ్యాన్ని వెలికితీసి వారికి సాధికారత  కల్పించేందుకు విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇలా మహిళల భాగస్వామ్యమున్న ప్రతిచోటా వివిధ మాధ్యమాల ద్వారా ‘సహజయోగ’ శిక్షణను అందించేందుకు సంకల్పించారు. మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి ప్రతీక, మూర్తీభవించిన ఆదర్శ మహిళ శ్రీ మాతాజీ  నిర్మలాదేవి మానవాళి శ్రేయస్సుకోసం సృష్టించిన ‘సహజయోగ’ ఫలితాలను సద్వినియోగం చేసుకుంటూ మన జీవితాల్లో శాంతి, సమృద్ధిని పెంచుకుందాం

‌‌- డాక్టర్ రాకేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement