Saturday, May 18, 2024

వెంటాడే జాడ్యం సోమరితనం!

విక్రమార్కుడు భారత కథాసాహత్యంలో చాలా ప్రసిద్ధి పొందిన వ్యక్తి. పూర్వం అవం తీపురాన్ని (ఇప్పటి మధ్యప్రదేశ్‌ ప్రాంతాన్ని) పాలించిన పరాక్రమవంతుడైన రాజు విక్రమాదిత్యుడు. ఆ రాజ్యానికి రాజధాని ఉజ్జయిని. భట్టి, విక్రమార్కుని తమ్ముడు. రణతం త్రంలో ఆరితేరినవాడు. సంవత్సరంలో ఆరు నెలలు విక్రమార్కుడు రాజ్యం ఏలితే, మిగతా ఆరునెలలు మంత్రి సామంతుల సహకారంతో భట్టి రాజ్య పరిరక్షణ భారం మీద వేసుకునేవా డు. ఆ ఆరు నెలలు విక్రమార్కుడు మారువేషంలో దేశసంచారం చేసేవాడు. అలాంటి ఒక సందర్భంలో, ఒక గుడిలో విక్రమార్కుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పేద బ్రాహ్మ ణుడు, అటుగా నడుచుకుంటూ వెళుతూ తాను కూడా కాస్త సేదదీరుదామని వచ్చి, విక్రమా దిత్యుడిని చూస్తాడు. ముఖవర్చస్సు చూడగానే సందేహపడి, తన సందేహం చెప్పి వివరం అడుగుతాడు.

ఉ|| సత్యము నీ మతిస్ఫురణ, క్షత్రియ వంశకరుండ విక్రమా
దిత్యుఁడ నే నవంతిన పతింబరదేశ విశేష దర్శనం
బత్యనురక్తిఁజేయఁగనయంబునఁద్రిమ్మరుచుండుదున్సుఖౌ
చిత్యగుణంబు నా కదియ చెప్పెడిదేమిఁకభూసురోత్తమా.
(కఱవి గోపరాజు రచించిన ‘సింహాసన ద్వాత్రింశిక’ నవమాశ్వాసం)

”నీవు ఊ#హంచినది నిజమే! నేను క్షత్రియ వంశానికి చెందినవాడనే. అవంతీ దేశాన్ని పాలించే విక్రమాదిత్యుడిని నేను. మిగతా దేశాలలో వింతలు విశేషాలను చూడడం అన్నది నాకు చాలా ఇష్టమైనది. అది తీర్చుకోవడానికి నేను ఇలా దేశాటనం చేస్తూ ఉంటాను. అందు లో నాకు చాలా సంతోషం కలుగుతుంది. పైపెచ్చు అలా తిరిగి వివిధ దేశాల సంగతులను తెలుసుకోవడం మంచిదిగా, ఒక రాజు చేయడానికి ఔచిత్యంతో కూడుకున్న పనిగానే నాకు తోస్తుంది” అని ఆ బ్రాహ్మణుడికి అసలు సంగతిని కొంత విశదంగానే చెబుతాడు విక్రమాది త్యుడు. విక్రమాదిత్యుడి మాటలకు ఆశ్చర్యపోతాడు ఆ పేద బ్రా#హ్మణుడు. విక్రమాదిత్యు డిని ప్రత్యక్షంగా చూస్తున్నందుకు ఆనందపడతాడు కూడా! అయితే అతడికి ఒక సందేహం కలుగుతుంది.

సీ|| అనవుడునాశ్చర్యహర్షంబులొందుచు
భూసురోత్తముఁడాత్మబుద్ధి మెఱసి
మృదులాంబరంబులు మేనఁబూనక జోగి
కైవడినీ బొంతగప్ప నేల
హంసతూలిక శయ్యయందు నిద్రింపక
బూడిదలోఁ బడి పొరలనేల
ఘనమైన రాజ్యమేకచ్ఛత్రముగఁగల్గఁ
దిరిపెమైయూరూరుఁదిరుగ నేల

ఆ.వె. అష్టభోగములకునాలయంబయ్యు నీ
వష్ట కష్టములను నలయ నేల
కుడువఁగల్గి నీకుఁ గుడువలేకుండుట
యల్పతరము గాదె యవని నాథ.
”మంచివైన, మెత్తనివైన బట్టలను కట్టుకోవాల్సిన శరీరాన్ని కష్టపెడుతూ, జోగిలాగా ఆ బొంతను ఎందుకు ధరించడం? పట్టుపరుపులతో నింపబడి వుండే హంసతూలికాతల్పం మీద పడుకుని హాయిగా నిద్రించాల్సి ఉండగా, బూడిద నిండి ఉన్న నేల మీద పడుకుని అందులో దొర్లడం ఏమంత గొప్ప పని? ప్రసిద్ధి వహంచిన ఘనమైన రాజ్యానికి ప్రభువుగా ఉండడం వలన ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజ్యం చెయ్యాల్సింది పోయి, ఊరూరా తిరుగుతూ ఈ తిరిపెమెత్తి భుజించడం ఏమిటి? అష్టైశ్వర్యాలను అనుభవించాల్సి ఉండగా అష్టకష్టాల నూ కొని తెచ్చుకుని మరీ అనుభవించడం ఎందుకు? అనుభవించాల్సిన అర్హత ఉండగా అను భవించకపోవడమనే స్థితి ఉన్నదే, అది నిన్ను నీవు చిన్నబుచ్చుకోవడమే అవుతుంది కదా?!” అని తన ఆలోచనను విక్రమాదిత్యుడికి నిర్మొహమాటంగా చెప్పి, ఇంకా ఇలా అంటాడు.

- Advertisement -

కం|| ననుఁ బోటి పేదయైనను
ధనమించుక కలిగెనేనిఁ దనమది సక్చం
దనవనితాది సుఖంబుల
మనఁగోరుంబసరమైన మరగదె సుఖముల్‌.

”నాలాంటి పేదవాడు కూడా, ఎక్కడనుండైనా కొంత అదనంగా డబ్బు సమకూరితే, మరి ఆలోచించకుండా అనవసరపు విలాసాల కోసం ఆ డబ్బుని ఖర్చు పెడతాడు కదా! అలాంటిది నీవు రాజువై ఉండి కూడా ఈ కష్టాన్ని ఎందుకు ఇష్టంగా చేసుకుని బ్రతుకుతున్నా వు?” అని అక్కడితో ఆగకుండా చెప్పదలుచుకున్న అసలు సంగతిని ”పసరమైన మరగదె సుఖముల్‌” అని చివరి మూడు మాటల్లో చెబుతాడు. ”కాయకష్టం చేయాల్సిన పశువు కూ డా సుఖం మరిగే అవకాశం వస్తే సుఖించకుండా మానుతుందా? మానదు కదా!” అని ఆ మాటల అర్ధం. ఇందులో ఆ బ్రాహ్మణుడి ఆలోచన లోకంలో సామాన్యంగా జరిగే సంగతిని గురించి చెప్పడం. అయితే ఇక్కడ అంతర్లీనంగా ఉండి గ్రహంచాల్సిన విషయం మాత్రం ‘సోమరితనం ఒక జాడ్యం’ అన్నది. ఈ జాడ్యం మనుషులలోనే కాదు, అవసరమైన జాగ్రత్త లు తీసుకోకపోతే, పశువులలో కూడా అది కనపడే ప్రమాదం ఉందని గోపరాజు భావన. ఈ భావన ఆయన ఒక్కడిదే అయివుండే అవకాశం లేదు. జనంలో ఉన్న భావనలనే గోపరాజు తన కావ్యంలోని పద్యాలలోకి సందర్భోచితంగా జొప్పించి చెప్పాడు. అలా చెప్పిన అనేక మైన మంచి మాటలలో ఇది ఒకటి. మనిషన్నవాడు కష్టపడాలి. అది శారీర కష్టమా లేక బుద్ధి తో చెసే కష్టమా అన్నది ఆయా వ్యక్తుల జీవిత విధానానికి సంబంధించి ఉంటుంది. నలభై ఏళ్ళకే రిటైరై ఇంట్లో ఖాళీగా కూర్చోగలిగే ఆర్ధిక స్తోమతను సంపాదించుకోవడంపై దృష్టి పెట్టడం వలన ఆ తరువాతి 60 ఏళ్ళ జీవితం చాలా సుఖంగా గడుస్తుందనుకోవడంలో ఎంతపాటి విజ్ఞత ఉందో మనిషి ఆలోచించాలి. వందేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకునే మనిషి, అదే వందేళ్ళు కష్టపడి బ్రతికే అవసరం తనకు ఉండాలని కోరుకోవడమే విజ్ఞత అనిపి స్తుంది. అలాకాకుండా, ఏ పనీ చేయకుండా గడపడమే సుఖం అన్న భావనను మనసులోకి తెచ్చుకుంటే జరిగే అనర్ధం సోమరితనం అనే వదిలించుకోలేని జాడ్యాన్ని అంటించుకోవడం. ఒకసారి అంటించుకున్న తరువాత, వదిలించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టినా ఆ జాడ్యానికి మందు మాత్రం దొరకదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement