Saturday, May 4, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 32
32.
సర్గాణామాదిరంతశ్చ
మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం
వాద: ప్రవదతామహమ్‌ ||

తాత్పర్యము : ఓ అర్జునా! సమస్త సృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదేవిధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయి యున్నాను.

భాష్యము : మనము ఇంతకముందే చెప్పుకున్నట్లు, సృష్టి, భౌతిక మూలకాలతో మొదలుపెట్టబడి, మహా విష్ణువు, గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదకశాయి వి ష్ణువుగా భగవంతుడు వాటి యందు ప్రవేశించి పోషిస్తూ ఉంటాడు. భగవంతుని భౌతిక గుణావతారాలైన బ్రహ్మ, శివుడు ఆ సృష్టిని కొనసాగించి, అంతము చేస్తూ ఉంటారు. ఈ విధముగా సృష్టికి ముందు ఉండి, దానిని పోషించి, నాశనము కావించుటకు కారణము భగవంతుడే. జ్ఞానముకు అనేక పుస్తకాలున్నాయి. నాలుగు వేదాలు, షడ్‌ దర్శనములు, వేదాంత సూత్రాలు, న్యాయ శాస్త్రాలు, ధర్మ శాస్త్రాలు మరియు పురాణాలు ఇవన్నీ కలిపి పదునాలుగు రకాల గ్రంధాలు ఉన్నాయి. అయితే వాటిలో ఆధ్మాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే వేదాంత సూత్రాలు కృష్ణుని సూచిస్తాయి. తర్కాన్ని చర్చించేవారు వేరు వేరు ప్రతిపాదనలను చేయుదురు. తన ప్రతిపాదనకు, ఎదుటివారి ప్రతిపాదనకు శాస్త్ర నిరూపణ నివ్వటాన్ని ‘జల్పన’ అని కేవలము ఎదుటివారిది తప్పు అని నిరూపించుటకు చేయు ప్రతిపాదనను ‘వితండ’మని అందురు. అంతిమముగా నిరూపించబడే సత్యాన్ని ‘వాదనము’ అని అందురు. ఇది కృష్ణున్ని సూచిస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement