Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 12
12
న త్వేవాహం జాతు నాసం
న త్వం నేమే జనాధిపా : |
న చైవ న భవిష్యామ:
సర్వే వయమత: పరమ్‌ ||

తాత్పర్యము : నేను గాని, నీవు గాని, ఈ రాజులందరు గాని నిలిచియుండని సమయమేదియును లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరము ఉండకపోము.

భాష్యము : శ్రీ కృష్ణుడు ఇక్కడ తెలియజేయుచున్న విషయాన్ని వేదాలలో కఠ ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తులందు కూడా తెలియజేయటమైనది : ”భగవంతుడు ఒకడే అయినా మిగిలిన జీవరాశులందరినీ వారి కర్మానుసారము అన్ని స్థితులలో పోషిస్తూ ఉంటాడని, అతడే పరమాత్మగా అందరి హృదయాలలోనూ ఉంటాడని, ఆ విధముగా అంతరంగమున, బహిరంగమున భగవంతుడ్ని గాంచు సాధువులు మాత్రమే శాశ్వత శాంతిని పొందగలరు” (కఠ ఉపనిషత్తు 2.2.23). కాబట్టి కృష్ణుడు, అర్జునుడు, మిగిలిన రాజులందరూ శాశ్వతమైన వ్యక్తులని, భూత భవిష్యత్తులలో కూడా వ్యక్తులుగా కొనసాగుతారని, ఇది తెలిసిన వ్యక్తి దు:ఖించవలసిన అవసరము లేదని ఇక్కడ తెలియజేయటమైనది. కొందరు ఇది వారి శరీరాలు వేరువేరని, శరీరాల గురించి చెప్పబడినదని వాదించుదురు. దీని ప్రకారము వారు కృష్ణున్ని ఒక సాధారణ వ్యక్తిగా భావించుచున్నారు. కాబట్టి భగవద్గీతను ఒక సామాన్యమైన గ్రంథముగా భావించుదురు. అంతేకాక ఇంతకు ముందే శరీర భావన తప్పని అర్జునుని మందలించి, మరలా శరీరముపై శ్రీ కృష్ణుడు ఎందుకు వాదించుననే ఇంగిత జ్ఞానము లోపించునట్లు మనము అర్థము చేసుకొనవచ్చును. శ్రీకృష్ణుడు, అర్జునుడు అందరు జీవరాశులు శాశ్వతముగా ఉంటారనే అవగాహన భక్తులకు మాత్రమే సాధ్యమగునని నాలుగవ అధ్యాయము సృష్టపరచబడనున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement