Friday, May 24, 2024

చక్షుర్దీప న్యాయము

చక్షువులు అంటే కళ్ళు. దీప అంటే దీపము. చక్షుర్దీపము అంటే కళ్ళు మరియు దీపము.
ఏదైనా ఒక వస్తువును చూడాలన్నా వాటిని నిశితంగా పరిశీలించాల న్నా కళ్ళు, దీపము రెండూ అవసరమే. అలాగే ఏ పనినైనా సాధించాలం టే బుద్ధి మరియు ప్రయత్నము రెండూ అవసరమే అనే అర్థంతో ఈ చక్షుర్దీప న్యాయమును ఉదా#హరణగా చెబుతుంటారు. చేయడానికి ఎన్నో మంచి పనులు ఉంటాయి. అవి చేయాలనే బుద్ధి, కోరిక ఉండాలి. అవి లేకపోతే ఏ పనీ క్రియా రూపం దాల్చలేదు. అలాగే బుద్ధి కోరిక ఉన్న ప్పటికీ ప్రయత్నం చేయకపోతే ఆ పని సాఫల్యత పొందదు.
దీనినే రాజుకూ, మంత్రులకు అన్వయిస్తూ రాసిన మారద వెంక య్య గారి భాస్కర శతక పద్యం చూద్దాం.
‘భూపతికాత్మ బుద్ధి మది బుట్ఠని చోట బ్రధానులెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులు గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగ వారు భాస్కరా!’
రాజుకు సరైన ఆలోచన పుట్టనప్పుడు అతని ఆస్థానంలోని మం త్రులు ఎంత తెలివి కలవారలైనా కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచన లేని కౌరవుల రాజైన దుర్యోధనుడి పనులను కార్యద క్షులైన ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు మొద లైన మహావీరులు నెరవేర్చలేకపోయారు కదా!’
అంటే రాజైన దుర్యోధనుడి ఆలోచనలు సరిగా లేకపో వడం వలన తనవైపు మహా వీరులైన భీష్మ ద్రోణ, కృప, కర్ణుడు మొదలైన మహావీరులు ఉన్నప్పటికీ వారు యుద్ధ విజయాన్ని సాధించి పెట్టలేకపోయారు. కారణం ఆలోచన, బుద్ధి బాగుం డాలి దానికి తగిన ప్రయత్నాలు జరగాలి.
అవి అక్కడ రెండు విధాలుగా లోపించ డం వల్ల కార్య సాఫల్యత జరగలేదు. ఆలో చనతో కూడిన బుద్ధి, ఆచరణతో కూడిన ప్రయత్నం… ఇవి రెండూ ఉండాలి.
ఈ రెంటికీ మధ్య సమన్వయం కూడా కుదరాలి. అప్పుడే ఈ చక్షుర్దీప న్యాయమునకు సరైన న్యాయం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement