Friday, May 3, 2024

ధర్మం – మర్మం : స న్మిత్రుడు (సి)


మహాభారత సంకలనం సుభాషిత సుధానిధిలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు నిగ్రహే
రాజద్వారే స్మశానైచ యత్తిష్ఠతి సబాంధవ:

అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు కష్టములు సంప్రాప్తించినపుడు, కరువు ఏర్పడినపుడు, శత్రువులను ఓడించవలసి వచ్చినపుడు, ప్రభుత్వముతో వ్యవహారం నడుచుచున్నప్పుడు రాజనిగ్రహం ఏర్పడినపుడు అనగా శిక్షపడినపుడు, అలాగే కావాల్సిన వారు మరణించినపుడు వారిని స్మశానమునకు తీసుకొని పోవుటకు వెంటవచ్చువారు నిజమైన మిత్రుడు, బంధువు అగును.

అన్ని సమయములలో వెంట ఉండి మనకు అనారోగ్యం ఏర్పడినపుడు, ఆపదలు, కరువు కాటకాలు వచ్చినపుడు పక్కకు తప్పుకొనే వారేఎక్కువ. ప్రభుత్వ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నపుడు లేదా శత్రువుతో తలపడుతున్నప్పుడు వారికి సాయం చేయటం వలన మనకి ఇబ్బందులు కలుగుతాయని పక్కకు తప్పుకొనే వారు ఎక్కువ. మృతదేహం అన్నా, స్మశానమన్నా భయపడే వారు తాము ఒకరోజు మరణించవలసి ందే అని ఆలోచించరు. బంధువులు, స్నేహితులు ఎవరైనా గతించినపుడు వారి వెనుక స్మశానం వరకు వెళ్ళేవారే నిజమైన ఆత్మీయులు. ఆపద సమయంలో, అనారోగ్యం పాలైనపుడు మన వెంట ఉండే వారే మంచి మిత్రులు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement