Saturday, May 11, 2024

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

అమరావతి, ఆంధ్రప్రభ: ‘హరహర మహాదేవ.. శంభోశంకర’ నినాదాలతో శైవక్షేత్రాలు మారుమో గాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే శైవక్షేత్రాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేశారు. బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు, భస్మాభిషేకాలు చేస్తున్నారు. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ మంత్రంతో శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. పంచారామ క్షేత్రాల్లో భక్తులు కిటకిటలాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లలేని భక్తులు స్థానికంగా ఉండే ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిం చుకున్నారు. పెద్ద సంఖ్య లో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్య వేక్షించారు. పేరొందిన ఆలయాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ 3225 ప్రత్యేక సర్వీసులను నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు, జాగారం చేశారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాతాళగంగలో తగినంత నీరు లేకపోవడంతో జల్లు స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి ప్రభోత్సవం, నంది వాహన సేవ నిర్వహించారు. మల్లికార్జునుడికి పాగాలంకరణ, లింగోద్భావకాల రుద్రాభిషేకం చేశారు. అర్ధరాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.
శివరాత్రి పర్వదనం సందర్భంగా కపిలతీర్థంలోని కపిలేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. గుంటూరు జిల్లా కోటప్పకొండలో తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా యాగంటిలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి, మహానందిలోని శ్రీ మహానందీశ్వర ఆలయం, కృష్ణాజిల్లాలోని కోటి లింగాలు, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, గుంటూరు జిల్లాలోని అమరావతి, తాళ్లాయపాలెంలోని శ్రీశైవ పీఠం, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఆలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. విజయవాడ పాతబస్తీలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్లకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టు-వస్త్రాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement