Monday, May 6, 2024

మేడారానికి పోటెత్తుతున్న భక్తులు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర అంటే ప్రతీ ఒక్కరికి మధుర జ్ఞాపకం. ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదంతోపాటు ప్రత్యేకమైన అనుభూతుల సమాహారం. ఆ వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు కోట్ల సంఖ్యలో మేడారానికి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే తల్లులకు బంగారంతో (బెల్లం) మొక్కులు చెల్లించుకున్న అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లోనే విందు భోజనాలు చేస్తారు. మేడారం జాతర అంటేనే పూర్తిగా మాంసాహారం,మద్యం సర్వసాధరణం. మేడారం చుట్టూ దట్టమైన అడవి, పక్కనే జంపన్నవాగు, చిన్న చిన్న సెలయేళ్లు… ఇంతటి ప్రకృతి రమణీయత మధ్య కుటుంబ సమేతంగా భక్తులు విడిది చేస్తారు. సహపంక్తి భోజనాలు చేస్తారు. కుటుంబంలో వృత్తిరిత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా జాతర సందర్భంగా ఒక్కటవుతారు. అంతా కలిసి అమ్మవార్లను దర్శించుకుంటారు. మేడారం సమ్మక్క-సారక్క జాతర అంటేనే ఏదో తెలియన ఉత్సాహం… మాటల్లో చెప్పలేని పరవశం భక్తుల్లో పరవళ్లు తొక్కుతోంది. ప్రధాన జాతరకు ఇంకా పది రోజుల సమయం ఉండగానే రెండు వారాలుగా శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతీ రోజూ మేడారాన్ని 10లక్షల మందికి పైగా దర్శించుకుంటున్నట్లు అధికారుల అంచనా. తాజా గా సోమవారం కూడా మేడారం భక్త జన సంద్రాన్ని తలపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉండడంతో జాతరనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో భక్తులు ముందుగానే రద్దీ లేని సమయంలో అమ్మవార్లను దర్శించుకుంటున్నట్లు దేవాదాయ, పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement