Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 72
72
ఏషా బ్రాహ్మీ స్థితి: పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామంతకాలే పి
బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||

తాత్పర్యము : ఇదియే ఆధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణ సమయమునందును ఆ విధముగా స్థితుడైనట్టివాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును.

భాష్యము : కృష్ణ చైతన్యమును లేదా దివ్యమైన జీవితాన్ని ఒక్క క్షణములోనైనా పొందవచ్చు లేదా కోటానుకోట్ల జన్మల తర్వాత కూడా పొందకపోవచ్చును. సత్యాన్ని అర్థం చేసుకుని, స్వీకరించుట మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఖట్వంగ మహారాజు మృత్యువునకు ఇంకా కొన్ని నిమిషములు మాత్రమే మిగిలి ఉండగా కృష్ణునికి శరణుపొంది ఈ చైతన్యమును పొంది ఉండెను. ‘నిర్వాణ’మనగా భౌతిక జీవితానికి స్వస్తి చెప్పుట. అయితే బౌద్ధులు భౌతిక జీవితము తర్వాత శూన్యము మాత్రమే ఉంటుందని చెప్పుదురు. కాని భగవద్గీత మనకు వేరే అవగాహనను ఇచ్చుచున్నది. ఈ భౌతిక జీవనము తర్వాత నిజమైన జీవితము మొదలవుతుంది. అయితే మనము జీవించి ఉండగానే కృష్ణుని సేవలో నియుక్తులమయినట్లయితే అవి వైకుంఠ కార్యములతో సమానమై బ్రహ్మ – నిర్వాణ స్థితిని పొందినట్లే లెక్క. బ్రహ్మస్థితి అనగా ‘భౌతిక కార్యముల స్థరము కాదు’ అని అర్థము. భగవద్గీత ప్రకారము భక్తి, ముక్త స్థితిలోనే ప్రారంభమవుతుంది. ‘సగుణాణ్‌ సమతీత్యైతాన్‌ బ్రహ్మభూయాయ కల్పతే’. కాబట్టి బ్రహ్మ స్థితి అనగా భౌతిక బంధనాల నుండి ముక్తులగుట.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జనసంవాదే
సాంఖ్యయోగో నామ ద్వితీయో ధ్యాయ: ||

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement