Monday, May 6, 2024

రాహుల్ రాకకోసం.. ఓరుగల్లు ముస్తాబు!

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాకకోసం వ‌రంగ‌ల్ రెడీ అవుతోంది. వందేండ్ల పార్టీ తెలంగాణలో పునర్వైభవం సంతరించుకునేందుకు వేదికగా ఉద్యమాల గడ్డ ఓరుగల్లును ఎంచుకుంది. వరంగల్ సెంటిమెంట్ తో రేపు (శుక్ర‌వారం 6వ తేదీన‌) హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు విభేదాలన్నీ పక్కనపెట్టి జనసమీకరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వరంగల్, హన్మకొండ ప్రాంతాలు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల రాకతో సందడిగా మారాయి. రాహుల్ టూర్ సక్సెస్ చేసి మరోసారి వరంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగ‌రేయాల‌ని తహతహలాడుతున్న నేతలంతా ఈ సభను ఓన్ చేసుకుంటున్నారు. దీంతో వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న‌ నేతలు పోటా పోటీగా, ఎవరికివారే జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదును ఏ మాత్రం పట్టించుకోని నేతలు కూడా ఇప్పుడు ఉదయం ఏడుగంటలకే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇదంతా సభ నేపథ్యంలో జరిగే సన్నాహక సందడి అనుకుంటున్నప్పటికీ నేతల ఉనికికి సంబంధించిన ఆరాటం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నెక్ట్స్ టికెట్ త‌న‌కంటే త‌న‌కేన‌ని అనుచరులు, కార్యకర్తల వద్ద చెప్పుకుంటున్నారు. వరంగల్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సభా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణం మొత్తం 24 ఎకరాలు కాగా సభలో 3 వేదికలు ఏర్పాటుచేశారు. ఇందులో ఒకటి రాహుల్ కూర్చునే ప్రధాన వేదిక, మరోటి తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక వేదికపై కళాకారుల ఆట, పాటకోసం ఉండ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement