Monday, May 13, 2024

సుగ్రీవుడు మాట తప్పాడా?

సుగ్రీవ, అంగద పట్టాభిషేక వార్త విన్న రామచంద్రుడు, లక్ష్మ ణుడితో కలిసి ప్రస్రవణ పర్వతం మీద నివసించాడు. భార్యలేని దు:ఖంతో ఆయనకు సంతోషం లేదు. అన్నను చూసి లక్ష్మణుడు ఆయన దు:ఖం పోయేట్లు సమాధానపరిచే వాడు. అన్నతో ”సర్వం అనుకూలంగా వస్తుంది. తగిన సమయం రాగానే సుగ్రీవుడు ప్రయత్నపూర్వకంగా సహాయం చేస్తాడు కాని మాట తప్పడు. కాబట్టి వానలు ఆగేదాకా సహించి ఇక్కడే వుందాం. ఆ తరువాత శత్రువులను ధ్వంసం చేద్దాం” అన్నాడు.
ఇదిలా వుండగా, హనుమంతుడు సుగ్రీవుడి ద్వారా రామ చంద్రమూర్తి కార్యం నెరవేర్చడానికి పూనుకున్నాడు. కార్యం నెరవేర్చాల్సిన కాలం సమీపించిందని హనుమంతుడు భావించా డు. ఆ విషయాన్ని సుగ్రీవుడు ఆలోచించకపోవడం కూడా గమ నించాడు హనుమంతుడు. స్వామి కార్యం మరచిన సుగ్రీవుడిని గుర్తించాడు. సుగ్రీవుడిని హెచ్చరించాలనుకున్న హనుమంతుడు, వినయంగా ఆయనతో ఇలా అన్నాడు.
”వానర రాజా! స్నేహితుల కార్యం ఇంకా నేరవేరాల్సి వుంది. కాబట్టే నేను నిన్ను హెచ్చరించగలుగుతున్నాను. నువ్వు నీకు మేలు చేసిన వారి పని చేయడానికి ప్రయత్నాలు చేయి. సీతను వెతకడానికి వానరులను పంపు. ఇప్పటికే సమయం మించిపోయింది. రామ చంద్రుడు, సీతాన్వేషణ కొరకు తొందరున్నప్పటికీ, సమయం, కాలం తెలిసిన వాడైనండున నిన్ను హెచ్చరించకుండా నీ నడవడి పూర్తిగా తెలిసేవరకు తొందర పడకూడదని వేచి వున్నా డు. నువ్వు చేయాల్సిన సహాయం వూరికే ధర్మానికి చేస్తున్నది కాదు. నీకాయన ముందుగా సహాయం చేశాడు. కాబట్టి నువ్వతడికి మారు మేలు చేయడం నీ కర్తవ్యం కదా? చేయకపోతే తప్పుకాదా? కాబట్టి సీతను వెతికించడానికి వానరులందరినీ ఇక్కడికి పిలిపించాలని కోరుతు న్నాను. వారు హెచ్చరించక ముందే చేస్తే దోషం లేదు”.
అదే సమయంలో రాముడు అక్కడ లక్ష్మణుడితో ఇలా అన్నా డు: ”లక్ష్మణా! సుగ్రీవుడేమో ఇంకా ఇక్కడికి రాలేదు. ఏదైనా ప్రయ త్నం చేశాడా అంటే అదీ లేదు. సీతను వెతికే పని ఆలోచించ డం లేదు. తగిన కాలంలో తన బాధ్యతను మరచాడు. లక్ష్మణా! నువ్వు కిష్కింధకు వెళ్లు. మూర్ఖుడై, భోగాలు మరిగిన కుటిల మనస్సుకల ఆ సుగ్రీవుడిని చూసి, నేను చెప్పానని ఇలా చెప్పు- ‘అంతకు పూర్వ మే తనకు ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేస్తానని ప్రమా ణం చేసి కూడా అది నెరవేర్చకపోవడం చేసినవాడిని పురుషాధ ముడు అంటారని ప్రాజ్ఞులు చెప్తారు. ముందు మాట చెప్పి ఆ ఆ మాట నెరవేర్చడానికి పాపమైనా, పుణ్యమైనా ఆడినమాట తప్పక సత్యం మీద వుండే కార్యనిర్వాహకుడే పురుషోత్తముడని పేరు పొం దుతాడు. తన కార్యం నెరవేర్చి మేలు చేసిన స్నేహితుడిని మరిచిన కృతఘ్నుడు చస్తే వాడి పీనుగను కుక్కలు, గద్దలు, నక్కలు తినక పోగా అటువైపు కూడా చూడవు’. అని ఇంకా ఈవిధంగా చెప్పు.”
”నా కోపానికి తగినవిధంగా నువ్విలా చెప్పు. ‘వానర రాజా! వాలి పోయిన మార్గంలో నీకిష్టముంటే నువ్వు కూడా పోవచ్చు. అయినా వాలి పోయిన దారిలో నువ్వు పోవద్దు. నువ్వేం ప్రమాణం చేశావో ఇప్పటికైనా జ్ఞాపకం తెచ్చుకో. వాలిచేసిన దోషానికి వాడిని మాత్రమే దండించాను. ద్రోహబుద్ధివై సత్యవాక్యం గమనించని నిన్ను, మూడుఢవైన నిన్ను, బంధువులతో సహా చంపుతాను. వానరరాజా! నువ్వు చెప్పిన ప్రమాణ వాక్యాలను జవదాటవద్దు. శాశ్వతమైన ధర్మ మార్గాన్ని వ్యర్థపరచవద్దు. నా వాడి బాణాలతో చనిపోయిన నీ అన్నను చూడడానికి పోవద్దు’. అని నా మాటగా, సమయోచితంగా ఇంకేదైనా చెప్పాలనుకుంటే కలిపి చెప్పు” అన్నా డు. అన్న ఆజ్ఞానుసారం లక్ష్మణుడు కిష్కింధ వైపు వెళ్లాడు.
కిష్కింధ ప్రవేశించిన లక్ష్మణుడిని వూరి బయట చూసిన కోతు లు, సుగ్రీవుడి ఇంటికి వెళ్ళి లక్ష్మణుడు కోపంతో వచ్చాడని చెప్పా రు. తన దగ్గరికి వచ్చిన అంగదుడితో లక్ష్మణుడు. ”నాయనా! నువ్వు వెళ్ళి నీ పినతండ్రికి చెప్పు. లక్ష్మణుడు నీతో మాట్లాడడానికి వాకిట్లో నిలిచి వున్నాడు. ఆయన మాటలు విన డానికి నీకిష్టమైతే, వానరుడా! నువ్విక్కడికి వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? నేను రాను, నువ్వు రావద్దు. నీ తోవన నువ్వు పొమ్మంటావా? నువ్వీ మాట చెప్పి ప్రత్యుత్తరం ఏమిస్తాడో తెలుసుకునిరా”. వెంటనే అంగదుడువెళ్ళి తారకు, రుమ కు వృత్తాంతమంతా చెప్పాడు.
లక్ష్మణుడు తన వాకిట్లో కోపంగా వచ్చి నిలబడ్డాడని చెప్పిన అంగదుడి మాటలు వినగానే, సుగ్రీవుడు, కూర్చున్నవాడు కూ ర్చున్నట్లే ఆసనం మీద వణకసాగాడు. ”నేను లక్ష్మణుడికి, రాముడి కి భయపడను. కాని ప్రియస్నే#హతుడు కారణం లేకుండా కోపానికి వచ్చాడు కదా అని బాధపడుతున్నాను” అన్నాడు. అప్పుడు సుగ్రీ వుడికి మరోమారు హనుమంతుడు హితబోధ చేశాడు.
”సుగ్రీవా! నువ్వు వారి విషయంలో దోషం చేశావు. ఆ దోషా నికి ప్రాయశ్చిత్తం నువ్వు లక్ష్మణుడికి రెండు చేతులు జోడించి మొక్కడమే. నీ మేలుకోరి, నీకు #హతమైన దానినే చెప్పాను. ఆ ప్రకారం చేస్తే బాగుపడతావు. రాముడు తన పని తాను చేసుకోలేక అసమర్థుడై నిన్ను ఆశ్రయించడానికి వచ్చాడనుకుంటున్నావా? ఆయనకు కోపమే వచ్చి విల్లు చేతపట్టుకుంటే, దేవతలతో, రాక్షసు లతో వెలిగే ఈ ప్రపంచమంతా లోబడేట్లు చేసుకోగలడు. పూర్వం రాముడు చేసిన ఉపకారం తలచి తిరిగి మేలు చేయి. రాముడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి వశమైపో” అంటాడు.
అంత:పురంలో ఈ విధంగా సమాలోచనలు జరుగుతుంటే, వాకిట్లోనే వున్న లక్ష్మణుడిని, అంగదుడు లోపలికి రమ్మని పిలిచా డు. లక్ష్మణుడు లోనికి పోయాడు. అక్కడ పరిస్థితి చూసి లక్ష్మణు డికి కోపం వచ్చింది. ఇంతలో అంగదుడు వచ్చి సుగ్రీవుడితో లక్ష్మ ణుడు వచ్చాడని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు తారను చూసి, ”లక్ష్మణుడు ఇంత కోపంలో ఎందుకు ఉన్నాడో కనుక్కొమ్మని, కార ణం లేకుండా లక్ష్మణుడికి కోపం రాదని, అలా కోప్పడడానికి మన లో ఏదో నేరముండాలని అన్నాడు. అలానే అని తార లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కోపానికి కారణం అడిగింది. వెంటనే లక్ష్మ ణుడు, సుగ్రీవుడు సమయాతిక్రమణం చేసాడని చెప్పాడు. ”నాలు గు నెలలకు వస్తానని మాట ఇచ్చి, సారా తాగుతూ, స్త్రీలతో ఆటలా డుతూ, కాలం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. ధర్మం చెడినప్పు డు అర్థం, కామం, వాటంత అవే చెడిపోతాయి. కాబట్టి వీటిని నీ మగడు వదిలాడు. ఇక వాడెలా బాగుపడతాడని అనుకుంటున్నా వు? వానరరాజు ఈ విధంగా ప్రవర్తించాడు కాబట్టి మేం చేయాల్సి న పనేంటో ఆలోచించి నువ్వే చెప్పు” అని అన్నాడు. ఆ మాటలు విన్న తార లక్ష్మణుడిని సమాధాన పరచింది.
తన మాటలకు లక్ష్మణుడు సమాధాన పడినట్లు గ్రహించి మళ్లి ఇలా అన్నది. ”రాజకుమారా! సుగ్రీవుడు మన్మథ వశుడైనా నువ్వు రాకముందే మీ కార్యం నెరవేర్చడానికి కావాల్సిన ప్రయ త ్నం చేశాడు. అతడి పిలుపు మేర కు బలవంతులైన, కోరిన రూపం ధరించగల అనేకులు, కోటాను కోట్ల వానరులు, వచ్చి వున్నారు. తార పిలవడంతో లోపలకి పోయాడు లక్ష్మణుడు. అక్కడ సుగ్రీ వుడిని చూశాడు. అలాగే లక్ష్మణుడిని సుగ్రీవుడు చూశాడు. సుగ్రీవు డిని చూసి లక్ష్మణుడు క్రూరమైన కోపంతో ఇలా అన్నాడు.
”నువ్వు రాజుగా వుండడానికి తగినవాడివి కాదు. తనకు మేలు చేసినవాడికి తిరిగి మేలు చేస్తానని ప్రమాణం చేసి, మాట తప్పి, ధర్మాన్ని ఉపేక్షించిన వాడికంటే మూర్ఖుడు, నీచుడు ఎవరో చెప్పు. నువ్విలానే చేశావు కదా! ముందు రామచంద్రుడితో నీ పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని కారణాన నువ్వు కృతఘ్ను డివి. మాన#హనుడివి. వంచకుడివి. నీచుడివి. అసత్యవాదివి. రాముడికి ప్రత్యుపకారం చేయాలని నీ మనస్సులో వుంటే, సీతా దేవిని వెతకడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయలేదు? నిన్ను వాలి పోయిన చోటుకే ఆయన పంపుతాడు. పాపాత్ముడా! వాలి పోయిన దారి ఇంకా మూతపడలేదు. తెరిచే వుంది. ఆ తోవలో పోవడానికి నువ్వు ఆలో చించవద్దు. నువ్వు చేసిన శపథం గుర్తుచేసుకో. నువ్వు రామకార్యా న్ని ఆలోచించడం లేదు. ఇది నిజం”. అన్నాడు.
లక్ష్మణుడిని తార సమాధాన పరిచే ప్రయత్నం చేస్తూ- ”ను వ్వు వాస్తవం తెలుసుకోకుండా కోపం తెచ్చుకోకూడదు. వాస్తవం ఏమిటంటే సుగ్రీవుడు రామచంద్రుడి కార్యార్థమై దేన్నైనా వదలి పెడతాడని నా అభిప్రాయం. లక్ష్మణా! సుగ్రీవుడు తాను చేసిన ప్రమాణం ప్రకారం యుద్ధంలో రావణుడిని చంపి రామచంద్రుడి తో సీతను కలపగలడు. సుగ్రీవుడు ఒంటరిగా వచ్చి మీ ఎదురుగా కూర్చుంటే కలిగే ఫలితం ఏమిటి? లంకలో లక్ష కోట్ల పైన, పదికోట్ల మూడులక్షల అరవై వేల రాక్షసులు ఉన్నారనీ, వారందరినీ చంపే దాకా రావణుడిని చంపడం సాధ్యంకాదనీ, సహాయం లేకుండా సుగ్రీవుడు ఒక్క డే రావణాసురుడిని ఎలా చంపగలడనీ, వాస్తవం తెలసిన వాలి నాతో చెప్పాడు. వాలి సుగ్రీవు డితో యుద్ధానికి పోయే ముందర నాతో ఈ విషయం చెప్పాడు. యుద్ధంలో మీకు సహా యం చేయడానికి వానర సమూహాలను ఇక్కడికి రమ్మని ఇంతకు ముందే సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఆ గడువు నేటితో ముగుస్తున్న ది. కాబట్టి సుగ్రీవుడి మీద మునుపటి ప్రేమ కలిగి వుండు. ప్రీతిగా అతడి భయం పోగొట్టు.”
ఇలా తార చెప్పగా, లక్ష్మణుడు తన కోపాన్ని వదిలాడు. అది చూసిన సుగ్రీవుడు లక్ష్మణుడంటే భయాన్ని వదిలాడు. అణకువతో ”లక్ష్మణా! పూర్వం పోయిన వానరరాజ్యం, సంపద, కీర్తి, ఇవన్నీ రామచంద్రమూర్తి దయవల్ల మళ్లిd నాకు లభించాయి. ఇది సత్యం. అంతటి పరాక్రమ సంపదకలవాడికి, సర్వకార్యంతో దిక్కులంత టా వ్యాపించిన కీర్తికల అంతటి వాడికి ఎవడు అపకారం చేయగ లడు? రామచంద్రమూర్తి సీతను మళ్లిd పొందగలడు. దానికోసం దుష్టుడైన రావణుడిని చంపగలడు. సందేహం లేదు. అయినప్ప టికీ నేను నిమిత్తమాత్రంగా సహాయం చేస్తాను. నా సహాయం లేక పోతే ఆయన తన కార్యం చేసుకోలేడని నా అభిప్రాయం కాదు.” లక్ష్మణుడు ఆ మాటలకు సంతృప్తిపడ్డాడు.
వెంటనే సుగ్రీవుడు హనుమంతుడితో భూమ్మీద ఎక్కడెక్కడో వున్న వానరులందరినీ, పిలిపించమన్నాడు. ఆయన అలాగే చేస్తాన న్నాడు. సుగ్రీవాజ్ఞ ప్రకారం వానర ముఖ్యులు దిక్కులు కనబడ నట్లు యుద్ధకాంక్షతో వచ్చారు. అంజనా పర్వతం నుండి కాటుక లాంటి నల్లటి దేహం కల వానరులు మూడు కోట్లమంది, పడమటి కొండ నుండి బంగారువన్నె దే#హం కల పది కోట్ల వానరులు, కైలా సం నుండి సింహం మెడమీది వెంట్రుకల లాంటి కాంతి కల వేయి కోట్ల మంది వానరులు, #హమవత్పర్వతం దగ్గర పండ్లు, వేళ్ళు తినే కోతులు వేయి వేలకోట్ల మంది, వింధ్య పర్వతం నుండి నిప్పు లాంటి ఆకారం కల కోటి వేలమంది కపులు, పాలసముద్రం తీరం నుండి టెంకాయలు తినే వానరులు లెక్కలేనంత మంది వచ్చా రు. వీరంతా రాముడి కార్యం సాధించడానికి వచ్చారు. అం టూ తాము తెచ్చిన పళ్ళు, పూలు, కానుకలను సుగ్రీవుడి ముం దుంచి, ”వానర రాజా! మీ ఆజ్ఞ కోతులందరికీ తెలియచేయగా వారంతా కిష్కింధకు వచ్చారు” అని చెప్పారు. సుగ్రీవుడు చాలా సంతోషించి వారి కానుకలను స్వీకరించి, వారందరినీ ఇండ్లకు పొమ్మని ఆజ్ఞా పించా డు. అక్కడి నుండి అంతా కలిసి శ్రీరా ముడి దగ్గరకు వెళ్ళారు.
(వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement