Wednesday, July 24, 2024

TS | అంతా నిశ్శబ్దం… బోసిపోయిన హైదరాబాద్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిత్యం కిక్కిరిసి పోయో హైదరాబాద్‌ ఎన్నికల వాతావరణంతో బోసిపోయింది. నిశ్శబ్ద వాతావరంలో ప్రజాజీవనం సాగింది. నిలిచి పోయిన వాహనాలు, ఆగిపోయిన పరిశ్రమల చక్రాలు,అధికారిక బంద్‌ పాటించిన వ్యాపారవాణిజ్యాలతో భాగ్యనగరం వన్నెతగ్గింది. దీనికి ప్రధానకారణం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామాలకు ప్రజలు తరలి వెళ్లడంతో ఈ వాతావరణం ఆవిష్కృతమైంది.

రాష్ట్రంలోని హైదరాబాద్‌ తో పాటు ప్రధాన పట్టణాల్లో రహదారులు బోసిపోయాయి. వాహనాలు హోరు, జోరు కనిపించలేదు. రోడ్లపై వాహనాలు లేకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగామారాయి. హైదరాబాద్‌ లోని ప్రధాన కూడలిల్లో అప్రకటిత కర్ఫ్యూ ప్రకటించినట్లుగా ఉంది. ఉపాధి, ఉద్యోగాలతో హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది తోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలు తమఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్‌ బోసిపోయింది.

హైదరాబాద్‌ నుంచి గత మూడురోజుల్లో 25 లక్షల మంది ఏపీకి వెళ్లినట్లు నిఘా వర్గాలు అంచనావేశాయి. కేవలం 12వ తేదీన ఒక్కరోజులోనే సుమారు 7లక్షల మంది హైదరాబాద్‌ నుంచి ఏపీ కి వెెళ్తునట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ జిల్లాల్లోంచి హైదరాబాద్‌ లో స్థిరపడిన వారు తమ ఓటు హక్కు సొంత ఊర్లలో ఉండటంతో ఊరి బాటపట్టడంతో బస్తీల్లో జనసందడి తగ్గిపోయింది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌,మంచిర్యాల,నిర్మల్‌, సిరిసిల్ల నుంచి అత్యధికంగా ఏపీకి తరలివెళ్లినట్లు సమాచారం. ఏపీలో ఉన్న తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వెళ్లారు.

బస్సుల ఏర్పాటు…

ఏపీలో పోటీలో ఉన్నఅభ్యర్థుల ప్రతినిధులు గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో పర్యటించి తమవారిని ఏపీకి తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పక్కా సమాచారం. అభ్యర్థుల పక్షాన హైదరాబాద్‌లోఉన్న ఆంధ్రకు చెందిన వలస కూలీలను ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ఊర్లకు తరలించారు. ప్రధానంగా కూకట్‌ పల్లి, బాలానగర్‌, యూసుఫ్‌ గూడ, సనత్‌ నగర్‌,అమీర్‌ పేట, కుత్బుల్లా పూర్‌,,నిజాంపేట్‌, పటాన్‌ చెరు, దిల్‌సుఖ్‌ నగర్‌ తదితర ప్రాంతాల నుంచి భారీగా ఏపీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వెళ్లడంలో హైదరాబాద్‌లో జనం లేక బోసి పోయింది.

- Advertisement -

సంక్రాంత్రి, దసరాపండుగల వాతావరణం ఒక్కసారిగా ఓట్ల పండుగ రూపంలో దర్శనమిచ్చింది. 2023 డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలో కోటి 54 లక్షల వాహనాలున్నాయి. ఇందులో అన్నిరకాల ద్విచక్రవాహనాలు 22 లక్షలు, ఆటోలు4.55లక్షలు ఉన్నాయి. స్కూల్‌ బస్సులు 28వేల 962 ఉన్నాయి. పోలింగ్‌ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో పాటు అంతకు ముందు శని, ఆది వారాలు రావడంతో స్కూలు విద్యార్థులు, ఉద్యోగులు సొంత ఊర్లకు పయనమయ్యారు.

అయితే హైదరాబాద్‌ లో నిత్యం 10 లక్షల వాహనాల రణగొణ ధ్వనులతో కిక్కిరిసి పోయేరహదారుల్లో వాహనాల ప్రయాణం లేక నిశ్శబ్ద వాతావరణ అలుముకుంది. నిత్యం ఎంతో రద్దీగా ఉండే సచివాలయం, అమీర్‌ పేట, సికింద్రాబాద్‌, నాంపల్లి ,నిజాం కళాశాల రోడ్డు, అబిడ్స్‌, కోఠీ బోసి పోయాయి. సెలవులతో పాటుగా ఎన్నికల కోసం షాపులు, సినిమా థియేటర్లు బంద్‌ ఉండటంతో ప్రజలు కేవలం ఓటుకోసమే బయటకు వచ్చే పరిస్థితి ఉండటంతో ప్రయాణం సులువు అయింది. నిత్యం జోరుగా హోరుగా సాగే బతుకుపోరు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement