Friday, April 26, 2024

సంతాన సంరక్షణకు పోలాల వ్రతం

శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ‘పోలాంబ’ వ్రతం చేస్తారు. అలాగే పోలాల అమావాస్యతో ముడివడియున్న ”పోలాంబ, పోలాల మ్మ, పోలకమ్మ, పోలేరమ్మ” పేరుతో దేవీ పూజలు చేస్తారు. ఈ వ్రతాన్ని పెళ్లయి చాలా కాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు సౌభాగ్యానికి, పిల్లల యోగ క్షేమాలకు, పిల్లలకు అకాల మృత్యు భయం లేకుండా పూజలు చేస్తారు. సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణమైన గ్రామ దేవతల కరుణా కటాక్షాలు ఉండాలని పూజించడం మన ఆచారం. మరి అటువంటి గ్రామ దేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత.
పొలాల అమావాస్య భక్తిశ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే గౌరీదేవిని పూజించి, పిల్లలకు పసుపు కొమ్ము కట్టిన తోరాలను కట్టే కార్యక్రమాలు ఆచరిస్తారు. పోలాల అమావాస్య వేడుకల నిర్వ#హణ సనాతన ఆచారంగా వస్తున్నది. పూజచేసే చోట ఆవుపేడతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, రెండు కందమొక్కలు (ఒక పెద్ద కంద మొక్క, ఒక చిన్న కందమొక్క) వుంచి, తెల్లదారం ఏడు పోచలు తీసుకొని దానికి పసుపు రాసి, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను చేసుకోవాలి. అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, తర్వాత ఆ కంద మొక్క లోకి మంగళగౌరీ దేవిని, సంతానలక్ష్మీ దేవినిగాని ఆవా#హనచేసి షోడశోపచారాలతో పూజించి, ఏడు పూర్ణం బూరెలు (మగపిల్లలు ఉన్నవారు), ఏడు గారెలు (ఆడపిల్లలు ఉన్నవారు) నైవేద్యం పెట్టాలి. సంవత్సరంలోపు పిల్లలున్న మహిళలు ఏడు బూరెలు, లేక ఏడు గారెలు పసుపురాసిన ఏడు పోచల దారానికి గుచ్చి, దండ లా చేసి దాన్ని కంద మొక్కకు వేసి, పూజిస్తారు. తర్వాత బ#హు సంతానవతి అయిన పెద్ద ముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని ఏడు పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని అమ్మవారికి వాయనంగా సమర్పించి దీవెనలు అందుకుంటారు. కంద మొక్కకు వేసిన బూరెలు, గారెల మాలను పిల్లల మెడలో వేస్తారు. పసుపుకొమ్ము కట్టిన తోరాన్ని ఒకటి మెడలో కట్టుకొని, ఒకటి పిల్లల మెడలో వేయాలి. కొంతమంది తమకు ఎంతమంది పిల్లలు వుంటే అన్ని తోరాలు చేసుకుంటారు. కొందరు ఆఖరు సంతానానికి వేస్తారు. ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా, మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోలాలమ్మ తల్లి కాపాడుతుందని విశ్వాసం. పోలాల అమావాస్య నాడు వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. వ్యవసా యం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు. గ్రామదేవతను ఆరాధిస్తూ… వ్యవసాయానికి సహకరించే పశువు లను పూజించే పర్వ దినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతా ల్లో కనిపిస్తుంది.

– రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement