Tuesday, April 30, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 9

9. ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచు న్మహాబంధనం
బేలా నా మెడ గట్టినాడ విక నిన్నే వేళ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలో గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! భార్యాపుత్రులు, తల్లితండ్రులు, ధనము మొదలైన పెద్ద పెద్ద బంధాలని నా మెడకు చుట్టినా వెందుకు? ఆ బంధాల వలన అకారణంగా పెరిగి పోతున్న చెడ్డదైన విషయ వ్యామోహమనే సముద్రంలో మునిగి పోయి ఉన్నాను. అలా మునిగి ఉన్న నేను నిన్ను ఏ సమయంలో ధ్యానించ గలను?ఈ భరింప రాని డుఃఖాన్ని ఎలా పోగొడతావో?
విశేషం: నిజమైన బంధనాలు ఆలుబిడ్డలు, తల్లి తండ్రులు, ధనము కాదు. వాటిపై మానవులు పెంచుకున్న వ్యామోహమే బంధము. జన్మ మెత్తిన తరువాత నిరసించ వలసినది సంబంధాలని కాదు. వాటిపై పెంచుకున్న అక్కఱ లేని వ్యామోహాన్ని. ఈ వ్యామోహంలో పడి భగవన్నామ స్మరణను వదిలేయటం జరుగుతుంది. అసలు దుఃఖం అది.
“ విపది స్మరణం శంభోః స్మరణం సర్వసంపదః” – అంటే శివుణ్ణి మరచి పోవటమే దుఃఖం, తలచుటే మహదైశ్వర్యం అని అర్థం.
రెండూ చింతలే. లౌకిక విషయాలపై చింత పోతే మిగిలేది ‘ శివుడి చింత’ యే.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇది కూడా చ‌ద‌వండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 8

Advertisement

తాజా వార్తలు

Advertisement