Monday, May 20, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

66. శుకముల్ కింశుక పుష్పముల్ గని ఫలస్తోమంబటంచున్
సముత్సుకతన్ జేరగ బోవ నచ్చట మహాదుఃఖంబు సిద్ధించు
గర్మకళాభాషల కెల్ల బ్రాపులగు శాస్త్రంబుల్ విలోకించు
వారికి నిత్యత్వ మనీష దూరమగుచో నో శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! శుకముల్ – చిలుకలు, కింశుక పుష్పముల్ – కని – మోదుగ పూలను చూసి, ఫల – పండ్ల, స్తోమంబు – సముదాయం, అట – అంచు – అని అనుకొని, సముత్సకతన్ – మిక్కిలి ఉత్సాహంతో, చేరగన్ – పోవన్ – సమీపించబోగా, అచ్చట – అక్కడ, మహాదుఃఖంబు – గొప్పదుఃఖం (నిరాశవల్ల) కలుగుతుంది, కర్మ – వేదవిహిత కర్మలు, కళా – 64 కళలు గూర్చిన, భాషలకు – ఎల్లన్ – విషయాలన్నిటికి మూలమైన, శాస్త్రంబుల్ – శాస్త్రాలని, విలోకించు వారికి – పరిశీలించే వారికి, నిత్యత్వమనీష – శాశ్వతమైన పరమాత్మ యందలి బుద్ధి, దూరమగున్ – లోపించును.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! చిలుకలు ఎఱ్ఱని మోదుగపూలని చూసి, పండ్లని భ్రమించి, ఉత్సాహంగా చేరబోగా, వాటికి నిరాశ వల్ల దుఖం వస్తుంది. అదేవిధంగా, వేదవిహితకర్మకాండలు, 64 కళలు మొదలైన వాటి గురించి చర్చించ టానికి వాటికి మూలమైన శాస్త్రాలని పరిశీలించే వారికి శాశ్వతుడైన పరమాత్మ యందు వర్తించే బుద్ధి లోపిస్తుంది.

విశేషం:
అర్థం తెలుసుకోకుండా, పదాలను మాత్రమే వల్లెవేసే చదువులకి “చిలక చదువులు”, “చిలకపలుకులు” అని పేరు. సమస్త వేదకర్మలు, కళలు, శాస్త్రాలు ఎవరిని, ఏ తత్త్వాన్ని ప్రతిపాదిస్తున్నాయో, దానిని గ్రహించకుండా, పరమార్థం తెలుసుకోకుండా శబ్దాన్ని, దాని నైఘంటుకార్థాన్ని మాత్రమే తెలుసుకునే వారికి అంత వరకే అర్థం అవుతుంది. ఎఱ్ఱనిరంగు చూసి మోదుగపూలని పళ్ళు అని భ్రాంతిపడ్డ చిలకల చందం అది.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement