Friday, May 17, 2024

బ్రహ్మజ్ఞాని వీతహవ్యుడు

సంసారస్యాస్య దు:ఖ స్య సర్వోపద్రవ దాయిన:
ఉపాయ ఏక ఏవాస్తి మనస: స్వస్య నిగ్రహ:
”సమస్త ఉపద్రవాలను కలిగించేది సంసారము. దాని శమ నము కొరకు ఉన్న ఒకేఒక ఉపాయము మనస్సును నిగ్రహించు కొనుట. ఈ సమస్త దృశ్య ప్రపంచము మనస్సు యొక్క స్వరూపము. సంసార చక్రమునకు మూలము మనస్సు. అటువంటి మనస్సును ఎవరయితే జయిస్తారో వారిని ఈ మాయాప్రపంచ సంసారము ఏవిధంగానూ బాధించదు” అని యోగవాసిష్టంలో వసిష్ట మహా ముని తెలియచేశారు. అంత:కరణ చతుష్టయాలయిన మనస్సు, బుద్ధి అహంకారము చిత్తములలో మనస్సును నియంత్రించినచో జన్మసార్థకమవుతుంది. జనన మరణ చక్రభ్రమణానికి మనస్సే కారణం. మనస్సు, ఆత్మ వేరు వేరు అనే విషయము గ్రహిస్తే గాని ఆత్మసాక్షాత్కరము కలగదని మన సనాతన వాఙ్మయం నొక్కివక్కాణిస్తున్నది. కాని దేహాత్మ భావన అనే అజ్ఞానము మనిషికి తీవ్ర ఆటంకము కలిగిస్తున్నది.
వీతహవ్యుడు అనే బ్రహ్మ జ్ఞాని మనసును, ఆత్మను చాలాచక్కగా విశ్లేషించిన తీరు యోగ వాసిష్టము. ఉపశమ ప్రకరణములో మనం చూడవచ్చు. మహాముని వీతహవ్యుడు సమాధి స్థితిని పొందగోరి వింధ్యపర్వత శ్రేణియందు గల సుమేరు పర్వత గుహయందు పాప రహిత శుద్ధ చైతన్యానికి చింతించసాగాడు. సమాధి స్థితిని చేరుటకు మనస్సు తీవ్ర అంతరాయం కలిగించడాన్ని గమనించాడు. ఆత్మను కనుగొనడానికి మనస్సు చేసే చంచలత్వాన్ని ఈవిధంగా చింతించ సాగాడు. ”మనసు ఎంత చంచలమైనది, విషయములపైకి పోకుండా ఎంత లాగిపట్టి ఉంచితే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే ఆకులా ఒక్క క్షణమైనా స్థిరంగా ఉండటం లేదు. ఘటము నుండి పటానికి, పటము నుండి శకటానికి అతి వేగంగా పరుగుపెడుతున్నది. చెట్టు పైన వున్న వానరములా పదార్థములనే కొమ్మలపై అటుఇటు గెంతు చున్నది.
ఓ మూర్ఖ మనసా! చేతనుడైన నాకు నీ వాసన అసత్యము, వ్యర్థ ము. ఎంతో భిన్నమైన చిదాత్మకు, మనస్సుకు ఏకత్వము లేనేలేదు. ఆత్మ యొక్క సత్తవలననే మనసు యొక్క ఉనికి స్ఫురించుచున్నది. ఆత్మనుండియే చిత్త శబ్దమును అంగీకరించి మనసు స్థితి బొందు చున్నది. కావున చిత్తము మృతుడు, మూర్ఖుడు, పరమార్థము లేనిది. దేహాదులేనేనని భ్రమించి జన్మాది దు:ఖములను కలిగించకు.
బాల, వృద్ద శరీరమును, పుత్రపౌత్ర ధనములు అసద్రూపము లు. అటువంటి వాటిని నావి, నావి అని చింతించటం అవివేకమే. అంతర దృష్టి రూపజ్ఞానముచే మనసుతో సహా ఈ దు:ఖప్రదమైన దృశ్యమంతయూ నశించి దు:ఖరహిత నిరతి శయానంద రూప మగు ఆత్మ మాత్రమే శేషించును. కావున ఏకాగ్ర ధ్యానముచే చిర కాలము సమాధి నిష్టుడనై ఆత్మను దర్శింతును. నిత్యోదయము, సమస్త సారము, చిన్మాత్ర రూపము అయిన ఆత్మ దిక్కులంతటను పరిపూర్ణముగా వ్యాపించుట నిర్మలమైన చిత ్తమున స్పష్టంగా తెలుస్తున్నది. సుఖదు:ఖములు రజ్జ సర్పభ్రాంతి వలె అసత్యము. నా పూర్వ అనుభూతులన్నియూ మోహభ్రాంతియే కాని యదార్థము కాదని తెలిసినది. పదార్థరహిత ఆత్మే అని తెలుస్తున్నది. సుఖం అంటే ఇదే అని గ్రహించాను. నా పూర్వపు అవిద్య నశించి ఆత్మ స్వరూపమును ఉదయింపచేసిన వివేకమునకు సదా కృత జ్ఞుడను.” ఈవిధముగా ఎల్లప్పుడూ మనసుతోటి విచారణ చేస్తూ వీతహవ్యముని వింధ్య పర్వత గుహలో నిశ్చల సమాధి స్థితియందు నిత్యానందుడై కూర్చొని వున్నాడు. జాగ్రత, సుషుప్తిల యందు ద్వైత మును చూపక స్వస్వరూప ఆత్మయందు తురీయస్థితుడై నిర్వి కారంగా ఉన్నాడు.
సర్వేక్షయాన్తా నిచయా: పతనాన్తా: సముచ్చ్రయా:
సంయోగ విప్రయోగానా: సర్వే సంసార వర్త్మని
ఈ ప్రపంచమున సంచయ మొనరించే అన్నీ తుదకు క్షయ మును పొందుతాయి. ఉన్నతమైనవి పడిపోతాయి. సంయోగము లన్ని తుదకు వియోగములు అవుతాయి. సమస్త దృశ్యదశకు అతీత మైనట్టి స్థితిలో ప్రణవార్థ చింతన వలన శాంతి లభించును. ఈ విధంగా తనలో వివేక చింతన చేస్తూ అకార, ఉకార మకార మాత్ర లతో ఓం కారాన్ని స్మరిస్తూ చింతామణిలా ప్రకాశిస్తూ వీతహవ్యుడు ఆత్మస్థితుడై నిలిచెను. పై వృత్తాంతమును శ్రీ వసి ష్ట మహాముని శ్రీరామచంద్రునకు ఉపదేశించెను అంత శ్రీ రామచంద్రుడు.
నష్టం కస్యమనోబ్రహ్మన్నష్టం వాకీదృశం భవేత్‌
కీ దృశశ్చాస్య నాశ: స్యాత్సత్తా నాశస్య కీదృశీ.
మహాత్మా! మనస్సు ఎవరికి నశించును? నశించిన మనస్సు రూపమేమి? మనస్సు ఏవిధముగ వినాశమును బొందును? వినాశమును బొందిన మనస్సు యొక్క వ్యవహారము ఏ లక్షణ మును కలిగియుండును? అని ప్రశ్నల వర్షం కురిపించెను. అంత వసిష్ట మహాముని ఈవిధముగా తెలియజేసెను. సుఖదు:ఖ దశలు ఏ ధీరుని సమరూపమగు ఆత్మ నుండి చలిం ప జేయజాలవో అట్టివాని చిత్తము నశి ంచినదని చెప్పవచ్చు. ఆపదలు, దీనత్వం, ఉత్సాహం, మదము, మాంద్యము, మహోత్సవము ఎవ ని ముఖంపై విరూపత్వము కలుగ జేయజాలవో అతని మనస్సు నశించినదని గ్రహించుము. జీవన్ముక్తుని మనస్సు మైత్రీకరుణాది గుణములతో గూడినది యు. ఉత్తమ వాసనాయుక్తమైనదియు మరల జన్మలేనిదియు అవుతున్నది. పదార్థమందు ఆసక్తిన వాసనయందురు. వాసనా రాహిత్యము వలన ఎప్పుడు మనస్సు నిరంతరము దేనిని కూడ సంకల్పింపక యుండునో, అప్పుడు పరమ శాంతి దాయకమగు అమనస్కస్థితి యందు నిలిచిపోవును. జగత్తునందలి పదార్థములన్నీ అసత్యము, మిథ్య అని తెలుసు కున్న తిరిగి మనస్సు ఉదయించదు. వాసనలయందు సంపూర్ణ త్యాగము కలిగితే శారీరక, మానసిక వ్యాధులన్నీ ఒక్క తృటిలో క్షయించును. వాసనాక్షయ, మనోనాశ, తత్త్వ జ్ఞానములు మూడును సమకాలమున నిరంతరము బహు కాలము అభ్యసించినప్పుడే ఫల ప్రదము పొందును. అప్పుడే నిరతి శయానంద రూపమున నిర్మల ఆత్మ పదమున ధీరుడవై నీవు నిలిచియుందువు. వసిష్ట మహామునిచే ఆత్మ జ్ఞానమును గ్రహించిన శ్రీరామచంద్రుడు అంజలి ఘటించెను.
మనమందరము శ్రీరామ నామ ధ్యానమందు ఆత్మ దర్శనము నకు ప్రయత్నించెదము.
శ్రీ రామరక్ష సర్వజగద్రక్ష.

– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement