Thursday, May 9, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 19
19.
నాన్యం గుణభ్య: కర్తారం
యదా ద్రష్టానుపశ్యతి |
గుణభ్యశ్చ పరం వేత్తి
మద్భావం సోధిగచ్ఛతి ||

తాత్పర్యము : సర్వ కర్మల యందును ప్రకృతి త్రిగుణములకన్నను అన్యుడైన కర్త వేరొక్కడు లేడని చక్కగా దర్శించి, త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినపుడు మనుజుడు నా దివ్యభావమును పొందగలడు.

భాష్యము : సరైన వ్యక్తుల నుండి వినుట ద్వారా సునాయాసముగా త్రిగుణముల ప్రభావమును అధిగమించవచ్చును. శ్రీకృష్ణుడే నిజమైన గురువు కాబట్టి ఈ విజ్ఞానమును శిష్యుడైన అర్జునుడికి వివరించుచున్నాడు. అదే విధముగా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులైన గురువు నుండి త్రిగుణముల తత్త్వమును అర్థము చేసుకొనవలెను. లేదంటే తప్పుదోవ పట్టుట తథ్యము. బద్ధజీవుడు తన పరిస్థితిని ఎప్పటికీ అర్థము చేసుకొనలేడు. ఒక రకముగా చెప్పవలెనన్న అతడు ఈ శరీరపు కోరికలచే బలవంతుముగా కార్యములు చేయించబడుచున్నాడు. త్రిగుణములు ఆ వ్యక్తి శరీరము, ఇంద్రియములను ప్రభావము చేయుచున్నవి. గురువు సూచనల ద్వారా తన దుస్థితిని తెలుసుకున్న జీవుడు త్రిగుణముల ప్రభావమును అధిగమించగలుగుతాడు. ఏడవ అధ్యాయములో తెలుపడినట్లు శరణాగతి పొందిన భక్తుడు మాయాప్రభావము నుండి బయట పడగలుగుతాడు. ఈ విధముగా వాస్తవాన్ని చూడగలిగినట్లయితే జీవునిపై త్రిగుణముల ప్రభావము క్రమేణా సన్నగిల్లుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement