Saturday, May 18, 2024

కపిలుని కోపం లోక కల్యాణానికి

మనకు చాలా పురాణ కథలు ఉన్నాయి. కాని కథలతో బాటే వాటిలో ధర్మాల ప్రస్తానవ ఉంటుంది. దానితో పాటే అందులోని పాత్రలు వాటి ఔచిత్యం ఉంటుంది. మనకు భగీరథుడు గంగను భూమికి తెచ్చాడని తెలుసు. తన పూర్వులైన సగర పుత్రులకు ఉత్తమ గతి కల్పించేందుకు, గంగను వారి బూడిద కుప్పల మీదుగా ప్రవహింపజేయాలనే సత్సంకల్పంతో ఆయన ఎన్నో శ్రమలకోర్చి అనితర సాధ్యమైన ఈ కార్యాన్ని సాధించాడు. అయితే కథా భాగంలో సగర పుత్రులు, ఎలాంటివారు, కపిలుడు వారిని బూడిదకుప్పలుగా ఎందుకు మార్చాడు, దాని పూర్వరంగం గురించి సందేహాలు వస్తూ ఉంటాయి. పురాణాలు అసాంతం చదివిన వారికి, పండితులకు అవన్నీ తెలుస్తాయి. సామాన్య పాఠకులు వాటి గురించి అడుగుతుంటారు. అవేమిటో తెలుసుకుం దాం.
ఒకప్పుడు విదర్భ రాజు కశ్యపునికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు కేశిని , సుమతి. ఆయన వారిని సగర చక్రవర్తికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి ఎంతకు సంతానం కలగకపోవడంతో ఒకనాడు భార్గవ వంశజుడు, మంత్ర వేత్త్త అయిన ఔర్వ మహర్షిని సంతానం కలిగే మార్గం చెప్పమని ప్రార్థించారు. దానికి ఆయన మీలో ఒకరికి వంశకరుడైన (వంశ వృద్ధికి తోడ్పడే) కుమారుడు, రెండో వారికి అరవై వేల మంది కుమారులు కలుగుతారన్నాడు. ఎవరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం అన్నాడు. కేశిని ఒకడినే కోరుకుంది. సుమతి అరవై వేల మందిని కోరింది. కొంతకాలానికి కేశినికి అసమంజసుడు అనే కుమారుడు కలిగాడు. అతడు మదించిన వానివెల అన్నీ చెడు పనులేచేయసాగాడు. అతనిని అనుకరిస్తూ సుమతి కుమారులు అరవై వేల మంది అదే బాటలో నడవసాగారు.
కుమారుల ప్రవర్త్తన మిక్కిలి బాధించింది సగరుడిని. ”అయ్యో! ఇనుముతో సంయోగం పొందిన అగ్నికి సమ్మెట పోటు తప్పదు కదా!” అని విచారించసాగాడు. ఇదిలా ఉండగా అసమంజసునికి అంశుమంతుడనే కుమారుడు కలిగాడు. అతడు చిన్నతనం నుంచే సర్వ శాస్త్రాలను అభ్యసించి, గుణవంతుడు, ధర్మజ్ఞుడిగా పేరు గాంచాడు. అంతేకాక తాత సగరుడి హితం కోరేవాడు. కాని చెడు నడత కల అతని తండ్రి అసమంజసుడు, పెదతండ్రులు లోకానికి ఉపద్రవం కలిగించేవారు. మంచివారిని హింసిించడం, మదిరాపానమత్తులై సంచరించడం, స్త్రీలను వేధించడం వంటి పనులకు వారు పాల్పడేవారు. బలవంతులు కావడంతో మిత్రలతో సైతం యుద్ధం చేసేవారు. లోకకంటకులైన వారిని నశింపజేసేందుకు ఇంద్రాది దేవతలు పాతాళ లోకంలో ఉన్నదేవదేవేశుడైన కపిల మహర్షి ని కలసి ఆయనకు నమస్కరించారు. ”మహానుభావా! సగర పుత్రలు ముల్లోకాలను పీడిస్తూ, దారుణ కృత్యాలు చేస్తున్నారు. ఈ ముప్పును తప్పించగలవారు మీరొక్కరే. అందుకే మేమంతా నీ శరణు వేడుతున్నాం” అని వేడుకున్నారు. దానికి కపిలుడు, ”ఓ సురోత్తములారా! తన కీర్తిని, బలాన్ని, ధనాన్ని ఆయుష్షును నశింపకోరుకునే వాడే లోకులను బాధిస్తాడు. నిరపరాధులైన జనులను బాధించే వాడే నిజమైన పాపాత్ముడు. కర్మతో, మనసుతో, మాటతో ఎప్పుడూ ఇతరుల్ని హింసించేవాడిని దైవం నశింపజేస్తాడు. దీనికై మీరు విచారించకండి. కొద్ది రోజులలో సగర పుత్రులు నశించబోతున్నారుని చెప్పగా దేవతలు కపిలుని వద్ద సెెలవు తీనుకుని స్వర్గానికి వెళ్లిపోయారు.
కొంతకాలానికి సగరుడు వసిష్ఠాది మునులను సంప్రతించి సాటిలేని అశ్వమేధ యాగం చేయ సంకల్పించి యాగాశ్వాన్ని విడిచాడు. దాని వెంట అతని అరవై వేల మంది కుమారులు బయలుదేరారు. అయితే ఇంద్రుడు ఆ అశ్వాన్ని మాయం చేసి దానిని పాతాళంలోని క పిల ముని ఆశ్రమం వద్ద కట్టేశాడు. దానిని వెతుకుతూ సగర పుత్రలు భూలోకం పూర్తి కాగా ఒక్కొక్కరు యోజనం దూరం తవ్వి పాతాళం చేరుకున్నారు.
అక్కడ కపిల ముని ఆశ్రమాన్ని చేరుకున్నారు. కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న కపిలుని చూసి, అతనిని దొంగ మహర్షిగా భావించి, దూషించి, దాడిచేయబోయారు.
ఐశ్వర్యంతో మదించినవారు, ఆకలితో ఉన్నవారు, కాముకులు, అహంకారంతో మూఢులైన వారికి వివేకం ఉండదు. నిధికి ఆధారం అయినందునే కదా భూమి మండుతూ ఉంటుంది. ఆ నిధిని అనుభవించే మానవులకు కూడా కోపంతో మండే స ్వభావం ఉంటుంది. దుర్జనులు సజ్జనులని బాధించడం వింతేమీ కాదు. ఉధృతమైన నదీ ప్రవాహం ఒడ్డున ఉన్న చెట్లను పెళ్లగించి వేస్తుంది. ఐశ్వర్యం, యవ్వనం, తెలివి ఉన్న చోట దారిద్య్రం, వార్ధక్యం, మూర్ఖత్వవెంటే ఉంటాయన్నది నిజం కదా. అగ్నికి వాయువు తోడైనట్లు, దుర్జనులకు బలం తోడైతే వినాశనం తప్పదు. ధనమదంతో ఉన్నవాడు గుడ్డివాని కిందే లెక్క. ఆత్మహితాన్ని చూసేవాడే నిజంగా చూపుకలిగినవాడు. సగర పుత్రులు తన మీదకు దాడి చేయబోగా కపిల మహర్షి కన్నుల నుంచి అగ్ని పుట్టి ఎదురుగా ఉన్న అరవై వేల మంది సగరపుత్రులు బూడిద కుప్పలయ్యారు. ఆయన కనుల నుంచి పుట్టిన అగ్ని వేడికి పాతాళలోకంలో ఉన్న సర్పాలు, రాక్షసులు పరుగు పరుగున వెళ్లి సముద్రాన్ని ఆశ్రయించారు.
సగర పుత్రుల మరణ వార్త దేవదూతలు సగరునికి తెలిపారు. ఆయనచింతించాడు. దుష్టులను దైవం శిక్షించక మానడు. తల్లి, తండ్రి, పుత్రలు ఎవరైనా అధర్మం చేస్తే వారు శత్రువులే. అధర్మం యందు ఆసక్తుడైన వాడు లోకులందరితో శత్రుత్వం తెచ్చుకుంటాడని శాస్త్ర నిర్ణయం. ఇలా ఆలోచించిన సగరుడు తన మనుమడైన అంశుమంతుని పుత్రునిగా స్వీకరించి, యజ్ఞం కొనసాగిస్తూ, యజ్ఞాశ్వాన్ని కనుగొని తెమ్మని పంపాడు సగరుడు. అంశుమంతుడు తన తండ్రులు తవ్విన బిలం గుండా పాతాళానికి వెళ్లి తేజోనిధి అయిన కపిల మహర్షిని చూసి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తదుపరి కపిలునితో ”మహర్షీ మా తండ్రుల దుష్ప్రవర్తనకు క్షమించండి. సజ్జనులు పరోపకారమందు అసక్తులై ఉంటారు. క్షమ గలవారు, సజ్జనులు దుష్టుల యందు కూడా దయ చూపుతారు. చంద్రుడు, సూర్యుడు అందరికీ కాంతిని సమంగా పంచుతున్నారు కదా! చందన వృక్షాన్ని చీల్చినా అది అందరికీ పరిమళాన్ని పంచుతూనే ఉన్నది కదా! దేవా! బ్ర హ్మధ్యాన నిరతా నీకు నమస్కారం అని శరణు వేడాడు. దానితో దయాళువైన కపిలుడు ”’నీకేమి కావాలి నాయనా!” అని అడిగాడు. దానితో అంశుమంతుడు ”అయ్యా! మా పితరులు బ్రహ్మలోకం చేరుకునే వరమివ్వండి” అన్నాడు. దానికి సమాధానంగా కపిలుడు ”నీ మనుమడు ఇక్కడకు పవిత్ర గంగాజలాన్ని తెచ్చి ప్రవహింపజేస్తాడు. దానితో వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇదిగో ఈ అశ్వాన్ని తీసుకువెళ్లి నీ తాతతో కలసి యజ్ఞాన్ని పూర్తి చేయి” అని ఆశీర్వదించాడు. అశ్వమేధ యాగాన్ని ఘనంగా పూర్తి చేశాడు సగరుడు. విష్ణువుని ఆరాధించి పరమ పదం చేరాడు. అంశుమంతునికి జన్మించిన వాడే దిలీపుడు. అతడికి జన్మించిన భగీరథుడూ గంగను భూలోకానికి తీసుకువచ్చి సగర పుత్రుల బూడిద కుప్పల మీదుగా ప్రవహింపజేశాడు. వారు ఉత్తమ గతులు చేరుకున్నారు.
కపిలుడు సగర పుత్రుల్ని బూడిద చేసింది లోక కల్యాణానికే. వారు దుష్టు ల కనుక వారిని శిక్షించా డు. అయినా కొంత కాలానికి వారికి ఉత్తమగతి కలిగింది. ఆయన కోపం వ ల్లనే భగీర థుడు విశ్వ ప్రయత్నంతో గంగనుభువికి తీసుకువచ్చాడు.

డాక్టర్‌. గాది శ్రీనివాస్‌
99890 79742

Advertisement

తాజా వార్తలు

Advertisement