Thursday, May 2, 2024

క‌ట్ కాపీ పేస్ట్ మూవీకి 250 కోట్ల అంచ‌నా.. త‌క్కువ క‌లెక్ష‌న్ల‌తో బాలీవుడ్‌లో మ‌రో డిజాస్టర్

విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో 2017లో రిలీజైన‌ తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’. సుమారు 11 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ గా రీమేక్ చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన వేద పాత్రను హిందీలో హృతిక్ రోషన్ పోషించారు. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. హృతిక్ ఆ పాత్రను ఎలా చేయనున్నారనే ఆసక్తి కూడా ఏర్పడింది. తమిళంలో దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి హిందీలోనూ డైరెక్ట్ చేశారు. సుమారు రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన బాలీవుడ్ ‘విక్రమ్ వేద’.. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమాను చూసిన హిందీ విమర్శకులంతా ఇదొక అద్భుతమని.. హృతిక్, సైఫ్ అదరగొట్టారని ప్రశంసలు కురిపించారు. చాలా మంది బాలీవుడ్ రివ్యూవర్లు 4 స్టార్లకు పైగా రేటింగ్‌లు ఇచ్చారు. అయితే, హిందీ ప్రేక్షకులు ఇచ్చిన ఫలితం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 250 కోట్లకు పైగా వసూలు చేయాల్సిన ‘విక్రమ్ వేద’.. తొలిరోజు రూ.10.58 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో ఫలితం ఏంటో ట్రేడ్ వర్గాలకు అర్థమైపోయింది. బాలీవుడ్ ఖాతాలో మరో డిజాస్టర్ నమోదైందని అంచనాకు వచ్చేశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా పేలవంగానే ఉన్నాయి.

హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ ఉన్న సినిమా ఇంత అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ కోసం ఎదురు చూస్తు్న్నారో అర్థం చేసుకోవాలి. ఓటీటీ వల్ల భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు వదలడం లేదు. ఇలాంటి సమయంలో ఒక భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని క‌ట్ కాపీ పేస్ట్ చేసి మరో భాషలో రిలీజ్ చేస్తే ఫలితం ఇలానే ఉంటుందని ‘విక్రమ్ వేద’ రుజువు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement