Friday, April 26, 2024

‘వాల్తేరు వీర‌య్య’ కంటే ముందే వ‌స్తున్న ‘గ్యాంగ్‌లీడ‌ర్‌’ .. చిరు ఫ్యాన్స్‌కి పండుగే పండుగ‌!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజుల ట్రెండ్ తో ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వారి అభిమాన హీరో మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు తెగ ఆరాట పడుతున్నారు. సినిమా ప్రోడ్యూసర్లు కూడా పాత సినిమాలను 4కే లో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సిినిమాల కంటే.. రీ రిలీజ్ సినిమాలకే హౌస్ ఫుల్ అవుతుండటం విశేషం. ఓపక్క సంక్రాంతికి పెద్ద హీరోల మధ్య బీభ‌త్సమైన పోటీ నెలకొంది.. థియేటర్ల కోసం దబిడి దిబిడే అన్నట్టుంది వ్యవహారం.. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ‘వర్షం’, ‘బిల్లా’ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొన్నటకి మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ కూడా సెలెక్టెడ్ స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తే.. దాదాపు అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి..

అయితే.. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది.. మెగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్ ఏంటంటే.. మెగాస్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ కాబోతోంది. కొద్ది నెలలక్రితం ‘ఘరానా మొగుడు’ కొన్ని థియేటర్లలో స్పెషల్ షోలు వేశారు. దీనికి ఫ్యాన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. కాకపోతే పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఈసారి అలాంటివేమీ జరగకుండా.. పక్కా క్లారిటీతో డిసెంబర్‌లో థియేటర్లలోకి రాబోతున్నాడు ‘గ్యాంగ్ లీడర్’.

ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రింట్ రీ మాస్టర్డ్ వర్క్ కూడా స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. క్యూబ్, డీటీఎస్ లాంటి పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా.. విజయబాపినీడు దర్శకత్వంలో.. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ మీద మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మించిన ‘గ్యాంగ్ లీడర్’ 9 మే 1991న విడుదలై సంచలన విజయం సాధించింది. అప్ప‌ట్లో చిరు సత్తా ఏంటనేది బాక్సాఫీస్‌కి రుచి చూపించిందీ సినిమా.. బప్పీ లహరి పాటలైతే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ‘వాల్తేరు వీరయ్య’ కంటే ముందుగానే.. ప్రేక్షకాభిమానులు మరోసారి వింటేజ్ మెగాస్టార్‌ని‌ తెరమీద చూడబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement