Tuesday, April 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

  1. నీ పంచం బడి యుండగా ( గలిగినన్భిక్షాన్నమే చాలు, ని
    క్షేపంబిచ్చినరాజకీటముల నే సేవింపగానోప నా
    శాపాశంబుల( జుట్టిత్రిప్పకుముసంసారార్థమై, బంటుగా(
    జేపట్టందయగల్గె నేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! నీ పంచన్- నీ ఇంటి చూరు క్రింద, పడి- ఉండగాన్- వేచి ఉండు స్థితి, కలిగినన్- లభ్యమైనట్లయితే, భిక్ష- అన్నము- ఏ-బిచ్చ మెత్తుకొని తెచ్చిన ఆహారమే, చాలున్- సరిపోతుంది. నిక్షేపము- దాచిన నిధి, అబ్బినన్- లభించినా, దొరికినా, రాజకీటములన్- రాజులనే పురుగులను, పురుగుల వంటిరాజులను, సేవింపగాన్- ఓపన్-సేవించలేను. మదిలో-నీ మనస్సులో, బంటుగాన్- సేవకుడిగా, చేపట్టన్- గ్రహించటానికి, దయ కల్గెను-ఏని- అనుగ్రహం కలిగినట్లయితే, సంసార-అర్థము-జననమరణచక్ర స్వరూపమైన సంసారం కొరకు, ఆశాపాశంబులన్- ఆశలను త్రాళ్ళతో, చుట్టి- బంధించి, త్రిప్పకు- తిరిగేట్టు చేయ వద్దు.
    తాత్పర్యం:శ్రీకాళహస్తీశ్వరా! నీ ఇంటి చూరు క్రింద పడిగాపులు పడి ఉండగలిగినా చాలు. అపుడుభిక్షాన్నంతోనే తృప్తి పడగలను. అంతే కాని, ప్రోగు చేసి, దాచి పెట్టిన నిధులను తెచ్చి ఇచ్చినా, రాజులు అనే పురుగులను సేవించ లేను. నన్ను నీ బంటుగా స్వీకరించటానికి దయతో అంగీకరించి నట్లయితే ఇకపై కోరికలు అనే త్రాళ్ళతో చుట్టి, సంసారమనే చక్రంలో పడవేయ వద్దు. (సంసారబంధవిముక్తుణ్ణి చేయమని ప్రార్థన.)
    విశేషం: దాస్యభక్తిద్యోతకం ఈ పద్యం. దాసుడి వలె స్వీకరించటమే గొప్ప అనుగ్రహం. తాను కైంకర్యం (చెప్పిన పని చేసి, ఇంకా ఏం చేయను? అని సేవకు సిద్ధంగా ఉండటం) చేయటానికి పంచలో పడి ఉంటానని, దానికి ప్రతిఫలం ఏమీ ఆశించక భిక్షాటనంతో జీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రాజు లిచ్చే నిధులని పొందటం కన్న పరమేశ్వరుడికి బంటుగా ఉండటమే ఘనమని భావన. భిక్షాన్నం తాను అడిగి తెచ్చినదే కానక్కర లేదు. శివుడి వద్ద ఉండేది భిక్షాన్నమే కదా! అంటే శివుడి భిక్షాపాత్రలో మిగిలిన ప్రసాదమని భావం. అది లభించిన తరువాత జననమరణచక్రం ఎక్కడ ఉంటుంది?
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement