Tuesday, May 21, 2024

ఎర్ర చందనం వ్యాపారం చట్టబద్ధమే.. ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

ఎర్రచందనం ఎగుమతులపై నిషేధాన్ని మన దేశం తొలగించింది. అంతరించిపోతున్న జాతుల వన్య జంతుజాలం, వృక్ష జాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం (సీఐటీఈఎస్‌), రెడ్‌ సాండల్స్‌ కోసం రివ్యూ ఆఫ్‌ సిగ్నిఫికెంట్‌ ట్రేడ్‌ (ఆర్‌ఎస్‌టీ) నుంచి మన దేశం తొలగించింది. గతంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరగడంతో ప్రభుత్వం దీన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. ఎర్రచందనం అరుదైన వృక్ష జాతికి చెందినది. ఇది మన దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లోనే పెరుగుతుంది. 2004 నుంచి మన దేశం ఎర్రచందనాన్ని ఆర్‌ఎస్‌టీలో ఉంచింది.

ఈ ప్రక్రియలో ఉన్న దేశాలు ఆర్‌ఎస్‌టీ బాధ్యతను నెరవేర్చకుంటే ఆయా దేశాలపై వాణిజ్య పరమమైన సస్పెన్షన్లు రూపంలో క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మన దేశం కూడా గతంలో ఇలా వాణిజ్య సస్సెన్షన్‌ను ఎదుర్కొంది. తాజాగా ప్రభుత్వం ఆర్‌ఎస్‌టీ ప్రాసెస్‌ నుంచి బయటకు వచ్చినందున ఎర్రచందనాన్ని చట్టబద్దంగా ఎగుమతి చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. దీన్ని సాగు చేసే రైతులకు ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. వీరు నేరుగా ఎగుమతి చేసుకోవచ్చు.

- Advertisement -

తాజా నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రయోజనం కలగనుంది. చాలా కాలంగా స్మగ్లర్ల నుంచి సీజ్‌ చేసిన ఎర్రచందనం నిల్వలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఎర్రచందనం పెరుగుతున్న అడవులన్నీ అభయారణ్యంగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఎర్రచందనం అత్యంత విలువైన వృక్షంగా ఉంది. ఎర్రచందనం పండించే వారికి ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అత్యధిక విలువైనది…

అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత విలువ కలిగి ఉండటంతో చట్ట విరుద్ధంగా అడవుల్లో ఈ చెట్లను నరికి, అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్నారు. ఈ జాబితా నుంచి బయటకు రావడం వల్ల ఎర్రచందనాన్ని రైతులు నేరుగా పెంచుకుని, విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎర్రచందనం బిజినెస్‌ ఇక నుంచి చట్టబ ద్దం కానుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నవంబర్‌ 6-10 తేదీ వరకు సమావేశమైన సీఐటీఈఎస్‌ స్టాండింగ్‌ కమిటీ దీన్ని ప్రకటించింది. ఈ సమావేశానికి మంత్రి హాజరయ్యారు.

1972 వన్యప్రాణుల రక్షణ చట్టంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన సవరణలను, అందులో సీఐటీఈఎస్‌ నిబంధనలను పొందుపరిచిన విషయాన్ని సమావేశంలో మంత్రి ప్రస్తావించారు. దీని ఫలితంగా సీఐటీఈఎస్‌ స్టాండింగ్‌ కమిటీ మన దేశాన్ని కన్వెన్షన్‌లోని కేటగిరి 1లో అంటే పూర్తిగా సమ్మతించడంలో ఉంచాలని నిర్ణయించింది. తాజాగా చట్టంలో చేసిన సవరణలతో ఇది దాని అవసరాలకు అనుగుణంగా ఉందని స్టాండింగ్‌ కమిటీ పేర్కొంది. గతంలో ఉన్న చట్ట నిబంధనల ప్రకారం మన దేశాన్ని పరిమితుల కేటగిరి 2లో ఉంచారు.

మన దేశ విదేశీ వాణిజ్య విధానం ప్రకారం రెడ్‌ సాండర్స్‌ దిగుమతిని నిషేధించారు. ఎగుమతులపై పరిమితం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రెడ్‌ సాండర్స్‌కు డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఖరీదైన ఫర్నిచర్‌, హస్తకళల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ చెక్క నుంచి లభించే ఎరుపు రంగును వస్త్రాలు, మందులలో కలరింగ్‌ ఏజెంట్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. నియంత్రణ, చట్టపరమైన రక్షణ ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా చెట్లను నరకడం, తరలించడం మూలంగా అరుదైన ఈ వృక్ష జాతికి ప్రమాదం పొంచివుంది.

మన దేశంలో అత్యంత దోపిడికి గురైన చెట్టుగా దీన్ని టీఆర్‌ఏఎఫ్‌ఎఫ్‌సీ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సీఐటీఈఎస్‌ సమాచారం ప్రకారం మన దేశంలో 2016-2020 మధ్యలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించిన 28 సంఘటనలు నమోదయ్యాయి. ఈ సంఘటనల్లో భారీగా ఎర్రచందనాన్ని సీజ్‌ చేశారు. ఇందులో 53.5 శాతం చైనాకు ఎగుమతి అవుతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు 25 శాతం, సింగపూర్‌కు 17.8 శాతం, అమెరికాకు 3.5 శాతం ఎగుమతి అవుతున్నాయి.

చైనాకు ఎగుమతులు…

మన దేశం నుంచి 19,049 టన్నుల ఎర్రచందనాన్ని ఎగుమతి చేశారు. దిగుమతి చేసుకున్న దేశాలు పేర్కొన్న వివరాల ప్రకారం 4,610 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యియి. రెండ్‌ శాండర్‌ బిజినెస్‌ను నివేదించంలో ఉన్న వ్యత్యాసాన్ని ఇది స్పష్టంగా తెలియ చేస్తోంది. మన దేశం నుంచి చైనాకు అత్యధికంగా చైనా 13,618 టన్నులు దిగుమతి చేసుకుంది. 5,215 టన్నులతో హంకాంగ్‌ రెండో స్థానంలో ఉంది. 216 టన్నులతోఓ సింగపూర్‌ తరువాత స్థానంలో ఉంది.

స్టాండింగ్‌ కమిటీలో పులి, సింహం, చిరుత, మంచు చిరుత, జాగ్వార్‌, ప్యూమా అనే ఏడు జంతుజాతులను కూడా సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని మన దేశం కోరింది. ఈ ఏడే పెద్ద పిల్లి జాతుల పరిరక్షణ కోసం 2023 ఏప్రిల్‌ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ (ఐబీసీఏ)లో ఎక్కువ దేశాలు చేరాలని మన దేశం కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement