Tuesday, April 30, 2024

లాభాల బాటలో పొగాకు రైతులు.. అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : పొగాకు రైతుల కష్టాలు క్రమేపీ గట్టెక్కుతున్నాయి. వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఈ సీజన్‌ భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో వర్జీనియా పొగాకుకు భారీ డిమాండ్‌ ఏర్పడటంతో ధరలు ఊహించిన దానికంటే అధికంగా పెరిగాయి. ఈ సీజన్‌లో బెస్ట్‌ గ్రేడ్‌ పొగాకు అత్యధిక ధర రూ.288 పలకగా, అన్ని గ్రేడ్ల సగటు ధర కేజీ రూ.214గా నమోదు కావటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు ఎగుమతులు భారీగా పెరగటంతో దక్షిణాది నల్లరేగడి నేలలు (ఎస్‌ బీఎస్‌), దక్షిణాది తేలికపాటి నేలల (ఎస్‌ ఎల్‌ ఎస్‌) పరిధిలో సగటు ధర రూ.214 నమోదయిందనీ, ఆ స్థాయి గరిష్ట ధర గడిచిన అయిదేళ్లుగా రాలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఎస్‌బీఎస్‌, ఎస్‌ఎల్‌ఎస్‌ నేలలు అత్యధికంగా ఉన్న ఒంగోలు రీజియన్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 11 వేల కేంద్రాల పరిధిలో రైతులు పొగాకు పండిస్తున్నారు. ఒంగోలు రీజియన్‌లోని కందుకూరు-1, కందుకూరు-2, కలిగిరి, డీసీపల్లి, ఒంగోలు-1, ఒంగోలు-2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరుతో వేలం కేంద్రాల పరిధిలో 2022-23 సీజన్‌ లో పొగాకు బోర్డు 89.35 మిలియన్‌ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించారు. రైతులు మాత్రం 122.34 మిలియన్‌ కిలోలను పండించారు. అధికంగా పండించిన పొగాకు వేలం కేంద్రాల్లో అమ్ముకోవాలంటే 5 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దానికి కూడా పరిమితి ఉంటుంది.

ఈ నేపథ్యంలో రైతులు తమకు గతంలో వచ్చిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని జరిమానా లేకుండా విక్రయించుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో కేంద్రం అధికంగా పండిన పొగాకు కొనుగోలు కోసం బోర్డుకు అనుమతించింది. అంతే కాకుండా వేలం కేంద్రాల పరిధిలోకి రాని స్క్రాప్‌ పొగాకు కొనుగోలు కూడా అనుమతించటంతో ఈ సీజన్‌లో రైతుల కష్టాలు గట్టెక్కాయి. స్క్రాప్‌ పొగాకు ధర కూడా కేజీ రూ 150 దాకా పలకటంతో రైతుల పంట నిల్వలన్నిటినీ అమ్ముకునే వెసులుబాటు కలిగింది.

- Advertisement -

భారీగా పెరిగిన బ్యారన్‌ కౌలు

గడిచిన రెండేళ్ళుగా పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో బ్యారన్‌ కౌలు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లోని లాభాలటెండ్‌ మరో రెండు మూడు సీజన్ల వరకు కొనసాగుతుందని భావిస్తూ బ్యారన్‌ కౌలు ధరలను పెంచేస్తున్నారు. గత ఏడాది కేవలం రూ 15 వేలు ఉన్న ఎకరం పొలం రూ 30 వేల దాకా పెరిగింది.. ఒక బ్యారన్‌ కౌలు లక్ష నుంచి రూ 2 లక్షల పెరిగింది. పొగాకు మార్కెట్‌ పై రైతులు అప్రమత్తంగా ఉండాలనీ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయన్న అపోహను విడనాడాలని పొగాకు ట్రేడింగ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

కౌలు చెల్లింపుకు పరిమితి విధించుకోవాలనీ, వేలంవెర్రిగా అత్యధిక ధరలు చెల్లిస్తే పెట్టు-బడి వ్యయం భారీగా పెరిగి అసలుకే మోసం వస్తుంది.. ఈ సీజన్‌ లోని ప్రత్యేక పరిస్థితుల వల్ల అధికంగా పండిన పొగాకుపై జరిమానాను రద్దు చేశారు..ప్రతి ఏటా అలాంటి పరిస్థితి ఉండదు.. అందువల్లనే మార్కెట్‌ ఫరిణామాలను పరిశీలిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలని సలహాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement