Monday, May 6, 2024

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం.. ధరల నియంత్రణకు నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వీటి ధరలను అదుపు చేయడంతో పాటు, ఉప్పుడు బియ్యం నిల్వలు పెంచేందుకు ప్రభుత్వం వీటి ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. దీనిపై ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎగుమతి సుంకం ఆగస్టు 25 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అక్టోబర్‌ 16 వరకు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎల్‌ఈవో జారీ కానప్పటికీ ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన పార్‌బాయిల్డ్‌ రైస్‌కు ఈ సుంకం వర్తించదని ఆర్ధిక శాఖ తెలిపింది.

దీంతో పాటు సరైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఉన్న ఎగుమతులకు కూడా సుంకం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా వీటి ధరలు కూడా పెరురుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులను తగ్గించేందుకు సుంకాలు విధించింది. మన దేశం నుంచి బాస్మతి కాకుండ ఇతర బియ్యం రకాల ఎగుమతుల వాటా 25 శాతంగా ఉంది.

- Advertisement -

ఈ సంవత్సరం వరి దిగుబడులు తగ్గుతాయని అంచనా ఉన్న నేపథ్యంతో పాటు దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణ చర్యల్లో భాగంగా ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం బియ్యం ఎగుమతులను నిషేధించింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన పాలిష్‌ చేయని తెల్ల బియ్యం ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది. బియ్యం కంటే ముందు ప్రభుత్వం నూకల ఎగుమతులపై కూడా నిషేధం విధించింది.

ప్రస్తుతం మన దేశం నుంచి బాస్మతి బియ్యం తప్ప అన్ని రకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లయింది. దేశీయ రిటైల్‌ మార్కెట్‌లో ఈ సంవత్సర కాలంలో బియ్యం ధరలు 11.5 శాతం పెరిగాయి. ఈ సంవతసరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య మన దేశం నుంచి 15.54 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు జరిగాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 11.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఎగుమతులు భారీగా పెరగడంతో నిల్వలు తగ్గిపోయి, దేశంలో బియ్యం ధరలు భారగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం నిషేధం విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement