Sunday, April 28, 2024

ఆర్టీసీకి కలిసొస్తున్న ఆధ్యాత్మిక శోభ!.. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు

అమరావతి, ఆంధ్రప్రభ:ఆధ్యాత్మిక శోభ ఆర్టీసీకి కలిసొస్తోంది. పేరొందిన పుణ్యక్షేత్రాలే కాదు..ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఆలయాలకు సైతం భక్తుల తాకిడి పెరుగుతుండటంతో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ఇప్పటికే దక్షిణ భారత దేశంలో ప్రాచుర్యం పొందిన అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రతి పౌర్ణమికి ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌ నగర్‌ సమీపంలోని ఎర్రవరం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆయా రోజుల్లో ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నారు.

కార్తీక మాసం వంటి ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే నడిపే ఆర్టీసీ సర్వీసులు ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిత్యం నడుపుతున్నారు. గతంలో ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు..ఇప్పుడు సాధారణ చార్జీలతోనే బస్సులు నడపడం ప్రయాణికులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.

- Advertisement -

పెరిగిన ఆధ్యాత్మికత..

కోవిడ్‌-19 తదనంతరం ఆధ్యాత్మికత పెరిగినట్లు చెప్పొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఆలయాలు సహా అనేక ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. రాష్ట్రంలోని శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. గతంలో పేరొందిన ఆలయాల్లో అంతంత మాత్రంగా ఉన్న ఆదాయం నేడు భారీగా వస్తోంది. ఒక్క విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి(దుర్గగుడి) ఆదాయం రోజుకు సగటున రూ.16లక్షల వరకు ఉంటోంది.

వీటితో పాటు జిల్లాల్లో పెద్ద ఆలయాలు, గ్రామ దేవతల ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరగడంతో అధికారులు సైతం మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించారు. ఆలయాలకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు సైతం నిత్యం సర్వీసులు నడుపుతున్నారు. వారాంతపు రోజుల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక సర్వీసులు..

తమిళనాడులోని అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వరస్వామి ఆలయానికి ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళుతున్నారు. ప్రతి పౌర్ణమికి ఏపీ నుంచి వందల సంఖ్యలో భక్తులు వెళ్లి శ్రీ అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. అక్కడికి పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని గతేడాది కాలంగా ఆర్టీసీ ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గతంలో విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల నుంచి మాత్రమే ఆర్టీసీ బస్సులు నడిపే వారు. ఇప్పుడు ప్రతి జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు అరుణాచలం వెళుతున్నాయి.

ఇటీవల తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌ నగర్‌ సమీపంలో ఎర్రవరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. ముఖ్యంగా ఆదివారం, శుక్రవారం రోజుల్లో విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఎర్రవరం వెళుతున్నారు. గతంలో భక్తులు కోదాడ వరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్టీసీ అధికారులే నేరుగా బస్సులు నడుపుతున్నట్లు భక్తులు చెపుతున్నారు. వారాంతపు రోజుల్లో శ్రీశైలం సర్వీసులకు సైతం పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు.

సాధారణ చార్జీలే..

గతంలో కార్తీక మాసం, శివరాత్రి వంటి పర్వదినాల్లో మాత్రమే ప్రత్యేక సర్వీసులు నడిపేవారు. పంచారామాలు, శైవ క్షేత్రాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయా క్షేత్రాలకు అదనపు చార్జీలపై బస్సులు నడిపేవారు. ఆర్టీసీ ఎండీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిర్వహించే ప్రత్యేక సర్వీసులపై పలుమార్లు సమీక్షించారు. ప్రత్యేక పర్వదినాలకే బస్సులను పరిమితం చేయడం, వాటికి అదనపు చార్జీలు వసూలు చేయడం వలన పరిమిత సంఖ్యలోనే భక్తులు ఆయా క్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉందని గుర్తించిన ఎండీ తిరుమలరావు.. సాధారణ చార్జీలతో సర్వీసులు నడిపితే మరింతగా భక్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.

ఈ మేరకు సాధారణ చార్జీలకే పుణ్యక్షేత్రాలకు సర్వీసులు నడిపేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో దసరా, దీపావళి వంటి రద్దీ రోజుల్లో సైతం సాధారణ చార్జీలకే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ఇటీవల కడప-తిరుపతి మధ్య విద్యుత్‌ బస్సులకు రానుపోను రూ.100 వరకు ఆర్టీసీ చార్జిలను తగ్గించారు. ఏదేమైనా రాష్ట్రం నుంచి భక్తుల తాకిడికి అనుగుణంగా ఆర్టీసీ సర్వీసుల నిర్వహణ వివిధ వర్గాలకు ఆర్టీసీని మరింత చేరువ చేస్తుందని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement