Monday, April 29, 2024

ఉత్తమ యాజమాన్య కంపెనీగా రిలయన్స్‌.. వరల్డ్‌ టాప్‌ 20లో స్థానం

ఆదాయం, లాభాలు, మార్కెట్‌ విలువ పరంగా మన దేశంలో అతి పెద్ద కంపెనీగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫోర్బ్స్‌ ప్రపంచ యాజమాన్యాల ర్యాంకింగ్స్‌లో దేశంలో అత్యుత్తతమ కంపెనీగా 2022లో మొదటి స్థానంలో, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. రిలయన్స్‌లో 2,30,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గత సంవత్సరం మొత్తం 800 కంపెనీల్లో రిలయన్స్‌కు 52వ స్థానం వచ్చింది. ఈ సారి మాత్రం ఏకంగా 20వ స్థానంలో నిలవడం విశేషం.

అత్యుత్తమ కంపెనీల జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, అల్ఫాబెట్‌, యాపిల్‌ వరసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో రెండో ర్యాంక్‌ నుంచి వరసగా 12వ ర్యాంక్‌ వరకు అమెరికా కంపెనీలే ఉన్నాయి. జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్‌ 13వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్‌ రిటైలర్‌ అమెజాన్‌ 14వ స్థానంలో, ఫ్రెంచ్‌ కంపెనీ డెకాథ్తాన్‌ 15వ స్థానంలో ఉన్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చమురు, టెలికం, రిటైల్‌ ఇలా విభిన్న రంగాల్లో విస్తరించి ఉంది. జర్మనీకి చెందిన మెర్సిడెస్‌ బెంజ్‌, అమెరికాకు చెందిన బేవరేజెస్‌ సంస్థ కోకా-కోలా, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ హోండా, యమహా, సౌదీ అరేబియాకు చెందిన ఆర్మాకో కంపెనీల కంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ర్యాంకింగ్‌లో ముందుంది.

ఇండియన్‌ కంపెనీలు రిలయన్స్‌ తప్ప మరే ఇండియన్‌ కంపెనీ కూడా టాప్‌ 100లో లేవు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 137వ ర్యాంక్‌, బజాజ్‌ 173వ ర్యాంక్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌కు 240వ ర్యాంక్‌, హీరో మోటోకార్ప్‌కు 333వ ర్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీకి 354వ ర్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌కు 365వ ర్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌కు 455వ ర్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 499వ ర్యాంక్‌, అదానీ ఎంటర్‌ ప్రైజేస్‌కు 547వ ర్యాంక్‌, ఇన్ఫోసిస్‌ కు668వ ర్యాంక్‌తో ఈ జాబితాలో ఉన్నాయి.

ఉద్యోగులపై సర్వే..

ఆయా బహుళజాతి కంపెనీల్లో పని చేస్తున్న 57 దేశాలకు చెందిన 1.50 లక్షల మంది ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులను సర్వే చేసి ర్యాంకింగ్స్‌ వెల్లడించినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ స్టాటిస్టా భాగస్వామ్యం ఉన్నట్లు తెలిపింది. తాము పని చేస్తున్న కంపెనీని స్నేహితులు, కుటుంబ సభ్యులకు సిఫారసు చేయడానికి ఉద్యోగుల సుముఖత, సంస్థ ప్రతిష్ట, ఆర్ధిక నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, సామాజిక బాధ్యత తదితర అంశాల్లో ఉద్యోగుల నుంచి రేటింగ్‌ సేకరించినట్లు వెల్లడించింది. మంచి వేతనాలు, కంపెనీలు కల్పిస్తున్న మంచి ప్రయోనాలు, ఎదుగుదలకు ఉన్న అవకాశాలు, పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం, సంస్థ అప్పగించిన పనిపై కేంద్రీకరణ, ఉద్యోగులపై యాజమాన్యాలు చూపే శ్రద్ద వంటి అంశాలను కూడా ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. వీటితో పాటు కంపెనీల ప్రతిష్ట, ఆర్ధిక స్థితిగతులు, స్త్రీ, పురుష సమానత్వం, సామాజిక బాధ్యత వంటి అంశాలను కూడా సర్వేలో పరిగణలోకి తీసుకుని ర్యాంక్‌లు ప్రకటించినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement