Thursday, March 28, 2024

యాదాద్రీశుడికి రికార్డు స్థాయి ఆదాయం.. ధర్మదర్శనానికి ఐదు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తీకమాసం పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో యాదగిరికొండ, పట్టణం కిటకిటలాడింది. ఆర్టీసీ ఉచిత బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు కొండ పైకి చేరుకున్నారు. ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, బ్రేక్‌ దర్శనం ద్వారా ప్రధానాలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వయంభువులను దర్శించుకొని తరించారు.

ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి ఐదు గంటల సమయం పట్టింది. సువర్ణ పుష్పార్చన పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. 1349 మంది దంపతులు శ్రీ సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో పాల్గొన్నారు. మహిళలు, యువతులు కార్తీక దీపాలను వెలిగించారు. వివిధ విభాగాలు కలుపుకొని ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో శ్రీవారిఖజానాకు రూ. 85,62,851 ఆదాయం సమకూరింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement