Monday, April 29, 2024

జీఎస్‌టీ 5శాతం ఎత్తివేత ప్రతిపాదన లేదు.. స్పష్టత ఇచ్చిన కౌన్సిల్‌ అధికారి

జీఎస్‌టీ నుంచి 5 శాతం శ్లాబు తొలగిస్తారని, 8 శాతం కొత్త శ్లాబు తీసుకొస్తారనే వార్తలపై జీఎస్‌టీ కౌన్సిల్‌తో సంబంధం ఉన్న ఓ అధికారి క్లారిటీ ఇచ్చారు. 5 శాతం శ్లాబును 8 శాతం శ్లాబుగా మార్చాలన్న ప్రతిపాదనను మంత్రుల బృందం ఇంకా పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. జీఎస్‌టీ శ్లాబుల సవరణ విషయంలో కర్నాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో ఓ కమిటీని గతేడాది ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌, కేరళ, గోవా, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారన్నారు. అయితే ఈ కమిటీ వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నివేదిక సమర్పిస్తుందని వివరించారు. ఈ కమిటీ చేసే సిఫార్సులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న జీఎస్‌టీ మండలి ముందు పెడుతుందని తెలిపారు.

మే రెండు, మూడో వారంలో భేటీ..

జీఎస్‌టీలో ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను రేట్లు ఉన్నాయన్నారు. పసిడి, పసిడి ఆభరణాలపై 3 శాతం పన్ను విధిస్తున్నారని, అన్‌ బ్రాండెడ్‌, అన్‌ ప్యాకేజీ ఆహార వస్తువులకు పన్ను మినహాయింపు ఉందని వివరించారు. జీఎస్టీ విధానంలో 5 శాతం శ్లాబును ఎత్తేసి ఈ పరిధిలో ఉన్న కొన్ని వస్తువులను 3 శాతానికి, మిగిలిన వాటిని 8 శాతం విభాగాలకు మార్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయన్నారు. అయితే ఈ విషయంలో ఇంకా చాలా ప్రక్రియ ఉందని స్పష్టం చేశారు. రేట్ల సవరణ అనేది రాజకీయ అంశాలతో ముడిపడిన అంశమని తేల్చి చెప్పారు. ఇంధన ధరలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రేట్లలో మార్పుపై ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే జీఎస్‌టీ శ్లాబుల సవరణ విషయంలో ఆర్థిక శాఖతో పాటు జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆచితూచి వ్యవహరిస్తుందని వివరించారు. అయితే మండలి భేటీ ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలియదని, మే రెండు లేదా మూడో వారంలో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement