Friday, May 3, 2024

Business: జూన్‌లో తగ్గిన కొత్త డీమ్యాట్‌ ఖాతాలు

కొంత కాలంగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీని ప్రభావం కొత్తగా మార్కెట్‌లో ప్రవేశించాలనుకునే వారిపై పడింది. జూన్‌ నెలలో కొత్తగా 17.9 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు మత్రమే తెరిచారు. 2021 ఫిబ్రవరి తరువాతే ఇదే అతి తక్కువ. సాధారణంగా మార్కెట్‌లో కొత్తగా ప్రవేశించే వారు చిన్న, మధ్యతరహా షేర్లలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఇలాంటి కంపెనీల షేర్లు తక్కవ రేటులోనే అందుబాటులో ఉండటం ప్రధాన కారణం, కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారు నష్టభయాలు తక్కువగా ఉన్న షేర్లనే ఎంపిక చేసుకుంటారు. ప్రస్తుతం స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు విలువలో భారీ పతనం నమోదవుతోంది. దీని వల్లే కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకునే వారు వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. స్టాక్‌మార్కెట్లు అత్యున్నతంగా ఉన్న 2021 అక్టోబర్‌లో అత్యధికంగా 35 లక్షల డీమ్యాట్‌ అకౌంట్‌లను తెరిచారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, చమురు ధరలు భారీగా పెరగడం, రూపాయి పతనం , ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆర్ధిక మాంధ్యం భయాలు ఇలా పలు కారణాలతో మార్కెట్లు తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నాయి.

ఈ కారణాలతోనే మార్కెట్‌లో క్రయ విక్రయాలు కూడా తగ్గాయి. మార్కెట్‌లో ఎంతో అనుభం ఉన్న వారు సైతం నష్టభయాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తవారు మార్కెట్‌లోకి ప్రవేశించే సాహసం చేయడంలేదు. ఫలితంగానే డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2019-20 సంవత్సరంలో 50 లక్షల డిమ్యాట్‌ ఖాతాలు , 2020-21 సంవత్సరంలో 1.5 కోట్లు, 2021-22 సంవత్సరంలో 3 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 9.65 కోట్లుగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు యాక్టీవ్‌గా ట్రేడింగ్‌లో పాల్గొనడంలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement