Friday, May 17, 2024

జీఎస్‌టీ వసూళ్లు రయ్‌రయ్‌.. గతేడాది కంటే 28 శాతం అధికం

దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అధికరేట్లు, డిమాండ్‌లో పెరుగుదల జీఎస్‌టీ వసూళ్లకు దన్నుగా నిలిచాయి. ఆగస్టులో పన్ను వసూళ్లు 28 శాతం పెరిగి రూ.1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తద్వారా వరుసగా ఆరవ నెలలోనూ రూ.1.4 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. జులైలో వసూలైన రూ.1.49 లక్షల కోట్లతో పోల్చితే ఆగస్టు వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. ఆర్థిక పునరుద్ధరణతోపాటు, స్థిరమైన వృద్ధికి జీఎస్‌టీ రాబడుల గణాంకాలు సానుకూల ప్రభావం చూపుతుందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం నాటి ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు-2022లో స్థూల జీఎస్‌టీ రాబడి రూ.1,43,612 కోట్లు. ఇందులో సీజీఎస్‌టీ రాబడులు రూ. 24,710 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రాబడులు రూ. 30,951కోట్లు, ఐజీఎస్‌టీ వసూళ్లు రూ. 77,782 కోట్ల తోపాటు సెస్సుల రూపంలో రూ.10,168కోట్లు సమకూరాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది ఆగస్టులో జీఎస్‌టీ రాబడుల మొత్తం రూ. 1,12,020 కోట్లుగా ఉన్నాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు మాసాల్లో రూ.7.46 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2021 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కంటే ఇది 33శాతం అధికం. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ రాబడులు అత్యధికంగా రూ.1.67 లక్షల కోట్ల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. రానున్న రెండు మూడు నెలల పండుగ సీజన్‌లో పన్ను వసూళ్లు ఆల్‌టైం గరిష్టానికి చేరుకునే అవకాశం ఉందని, ఎన్‌ఎ షా అసోసియేట్స్‌ భాగస్వామి (పరోక్షపన్ను) పరాగ్‌ మెహతా చెప్పారు. జులై 2022 నుంచి వివిధ మినహాయింపులను తొలగించడం కూడా జీఎస్‌టీ రాబడి పెరుగుదలకు మరొక కారణమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాల వారీగా..

అండమాన్‌ నికోబార్‌, లక్ష్యద్వీప్‌, మణిపూర్‌ దీవులు మినహా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 11 శాతం, అసోంలో 10, ఛత్తీస్‌గఢ్‌లో రెండు శాతం, డామన్‌ అండ్‌ డయూలో 4 శాతం, #హమాచల్‌ ప్రదేశ్‌లో 1శాతం, జమ్ము-కాశ్మీర్‌లో 11 శాతం, రాజస్థాన్‌లో 10, సిక్కిం 13, తెలంగాణ 10 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మైనస్‌ 21 శాతం, లక్ష్యద్వీప్‌లో 73 శాతం, మణిపూర్‌లో 22 శాతం మేరకు జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో…

ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్‌టీ వసూళ్లలో పెరుగుదల కనిపించింది. గతేడాదితో పోల్చితే 22శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఆగస్టులో రూ.2,591 కోట్లు వసూలవగా, ఈఏడాది రూ.3,173 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో తెలంగాణలో గతేడాది రూ.3,526 కోట్లుగా ఉన్న వసూళ్లు 10శాతం వృద్ధితో రూ.3,871 కోట్లుకు చేరుకున్నాయి. రాష్ట్రాలన్నింటిలోకెల్లా మహారాష్ట్ర అత్యధిక వసూళ్లతో అగ్రపథాన నిలిచింది. గతేడాది రూ.15,175 కోట్లుగా ఉన్న జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది రూ.18,863 కోట్లకు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement