Monday, April 29, 2024

Delhi | భారత్‌కు 400 మిలియన్ డాలర్ల ఏడీబీ రుణం.. పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ధ్యేయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత్‌లో పట్టణ మౌలిక వసతులు, పౌర సేవలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 400 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు సిద్ధపడింది. ఈ మేరకు భారత ప్రభుత్వంతో ఏడీబీ ఉన్నతాధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘సస్టైనబుల్ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ సర్వీస్ డెలివరీ ప్రోగ్రామ్’లో భాగంగా రుణ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ జూహీ ముఖర్జీ, ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఇండియా రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరక్టర్ టేకో కొనిషి సంతకాలు చేశారు.

సబ్ ప్రోగ్రామ్ – 1లో భాగంగా 2021లో 350 మిలియన్ డాలర్ల రుణానికి ఆమోదం లభించింది. ఇందులో భాగంగా పట్టణ సేవలను మెరుగుపర్చేందుకు జాతీయస్థాయి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించగా.. సబ్ ప్రోగ్రామ్-2లో రాష్ట్ర, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో పెట్టుబడి ప్రణాళికలు, సంస్కరణలకు మద్దతిచ్చేందుకు రుణాన్ని అందజేస్తోంది. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న భారత్‌లో గత 2 దశాబ్దాలుగా పట్టణీకరణ వేగం పుంజుకుంది.

పట్టణాలకు వలసలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో పట్టణాల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన, మెరుగైన పౌరసేవలను అందించేందుకు వివిధ అంతర్జాతీయ రుణ సంస్థల సహాయాన్ని తీసుకుంటోంది. ఇందుకోసం ఉద్దేశించిన పథకాల్లో అమృత్ 2.0 పథకం కోసం ఏడీబీ సబ్ ప్రోగ్రామ్-2 రుణాన్ని వినియోగించనున్న కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

పట్టణాల్లో మంచినీటి సరఫరాలో నష్టాలను తగ్గించడం, గృహేతర వినియోగానికి శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించడం, నీటి వనరుల పునరుజ్జీవనం, స్థిరమైన భూగర్భ జల స్థాయులు ఉండేలా ప్రణాళికలు రూపొందించండం ద్వారా పట్టణ నీటి భద్రతను నిర్ధారించడం వంటివి సైతం ఇందులో భాగం కానున్నాయి.

ప్రత్యేకించి, నగరాలు ఆర్థిక వృద్ధికి ప్రణాళికాబద్ధమైన కేంద్రాలుగా మారడంలో సహాయపడటానికి రవాణా-ఆధారిత అభివృద్ధి ద్వారా బిల్డింగ్ బైలాస్, ల్యాండ్ పూలింగ్, అర్బన్ అగ్లోమరేషన్ మరియు సమగ్ర పట్టణ చలనశీలత ప్రణాళికల ఆధునికీకరణకు వెసులుబాటు కల్పించేలా పట్టణ స్థానిక సంస్థలకు చేయూత అందించనున్నారు. పట్టణ మౌలిక సదుపాయాల పెట్టుబడులలో గణనీయమైన లోటును భర్తీ చేయడానికి వాణిజ్య రుణాలు, మునిసిపల్ బాండ్‌ల జారీ, సావరిన్ బాండ్ రుణాలు మరియు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు వంటి వినూత్న ఫైనాన్సింగ్‌లను సమీకరించడానికి ఇది నగరాలకు గణనీయంగా సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement