Monday, May 13, 2024

విజయవాడలో జోరుగా జీరో దందా

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలలో వాణిజ్యపన్నుల శాఖ ఒకటి. పన్నులు చెల్లించకుండా అక్రమ సరుకుల రవాణాను నిరోధించాల్సిన ఆ శాఖ అందుకు భిన్నంగా వ్యవహారిస్తుందనే ఆరోపణలున్నాయి. అక్రమ సరుకుల రవాణా జోరుగా సాగుతున్నా తనిఖీలు మాత్రం మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. దీంతో నగరంలో జీరోవ్యాపారం జోరుగా సాగుతోంది. మరోవైపు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ముడుపుల మత్తులో జోగుతున్నారు. మరోవైపు నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహిస్తున్నా ముడుపులు చెల్లించని వారిపై తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.

నగరంలో జీరోవ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయాలుగా విరాజిల్లుతుంది. ఎటువంటి బిల్లులు, వే బిల్లులు లేకుండా వివిధ రకాల సరుకులు పెద్ద ఎత్తున నగరం నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా సాగుతుంది. ఒకే వే బిల్లు మీద పది లారీల సరుకును వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ వే బిల్లులతో సరుకు దిగుమతి చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారిస్తున్నారు. జిల్లాలో రెండు డివిజన్లు, 16 సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి.
నగర పరిధిలో ఆరు సర్కిల్స్‌ ఉన్నాయి. ఆటో నగర్‌ సర్కిల్‌, బెంజ్‌ సర్కిల్‌, కృష్ణ లంక సర్కిల్‌, సీతారాంపురం సర్కిల్‌, ఇంద్రకీలాద్రి సర్కిల్‌, పార్క్‌ రోడ్డు సర్కిల్స్‌ ఉన్నాయి. వన్‌ టౌన్‌ లో వివిధ ప్రాంతాల్లో జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ పేరుకే చిన్న దుకాణాలు అయినప్పటికీ సదరు దుకాణాల్లో నిత్యం లక్షలాది రూపాయలు వ్యాపారం కొనసాగుతోంది. ఉత్తర భారత దేశానికి చెందిన కొంతమంది వ్యాపారులు వన్‌ టౌన్‌ లో రోజు కోట్ల రూపాయల వ్యాపారం జీరో లోనే చేస్తూ ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి.


వన్‌ టౌన్‌ ప్రాంతంలో చిన్న దుకాణాలకు భారీగా డిమాండ్‌ ఉంది. సామరంగం చౌక్‌, మెయిన్‌ రోడ్డు, పార్క్‌ వీధి, భావనారాయణ వారి వీధి, కందుల వారి వీధి, తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు లక్షల్లో వ్యాపారం సాగుతుందని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యాపారం చేసే ఉత్తరాది ప్రాంతానికి చెందిన వ్యాపారులు నిత్యం లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తుంటారు. నెలకు లక్షల్లో వ్యాపారం జరుగుతున్నప్పటికీ జీఎస్టీ పరిధిలోకి తాము లేమని వాణిజ్యపన్నుల శాఖ విభాగానికి పన్నులు చెల్లించడం లేదని సమాచారం. ఇక్కడ కొనుగోలు చేసే వస్తువులకు ఎటువంటి రసీదు ఉండదు. అమ్మకాలను జీరో వ్యాపారంలో నసాగిస్తూ వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు ఎగనామం పెడుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ్‌ సిబ్బంది ముడుపులు తీసుకుని అక్రమ రవాణాకు తమ వంతు సహకారం అందింస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం జీఎస్టీని అమలు చేస్తోంది. రూ. 20 లక్షలలోపు వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలు జీఎస్టీ నిబంధనలు వర్తించవు. దీనిని దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ నుంచి తప్పించుకునేందుకు ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ వ్యాపారం దిగ్విజయం సాగిస్తున్నారు. వాణిజ్యపన్నుల శాఖల అధికారులు ముడుపులు దండుకుని జీరో వ్యాపారానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఫలితంగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుంది.

- Advertisement -


ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చే దిశగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న ఆదేశాలను కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముడుపుల కోసం వ్యాపారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వ్యాపారంలో పోటీ పెరడగంతో పాటు లాభసాటిగా లేకపోవడంతో 60 శాతం ఎటువంటి బిల్లులు లేకుండా సరుకు కొనుగోలు చేసి జీరో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా అందుకు భిన్నంగా తమ జేబులు నింపుకునే కార్యక్రమంలో ఉంటున్నారని విమర్శలు వినవస్తున్నాయి. వాహనాలు తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం లేకుండా సరుకు రవాణా జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జీఎస్టీ అధికారులు మాత్రం అక్రమ రవాణా నిరోధించి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారికి అండగా నిలుస్తూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జాతీయ రహదారులపై నిత్యం కోట్ల రూపాయల విలువైన సరుకు రవాణా జరుగుతున్న అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారులు తనిఖీలు సందర్భంగా కొంత మందిపై కేసులు నమోదు చేసి, మరి కొందరి వద్ద ముడుపులు వసూలు చేసుకుని వారిని వదిలేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులను నియమించి వారి ద్వారా ముడుపుల వసూలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా పన్ను ఎగవేతదారులపైన, అక్రమ సరుకు రవాణా చేస్తున్న వారిపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసినట్లయితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం నిర్థిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement