Tuesday, May 7, 2024

జగన్ కౌంటర్‌పై రఘురామ రియాక్షన్ ఇది!

ఏపీ సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్ వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. కోర్టులో జగన్ తరపు న్యాయవాది చేసిన కౌంటర్‌లో తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఈ కేసులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు. జగన్ వేసిన కౌంటర్ లో ఎలాంటి విషయం లేదని విమర్శించారు. పైనున్న వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారని అన్నారు.  తన ఆరోగ్యం కోసం, తన బెయిల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని రఘురామ చెప్పారు.

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ పై రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీఎం హోదాలో ఉన్న జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని… వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. దీనిపై జగన్ తరపు న్యాయవాదులతో పాటు, సీబీఐ కూడా కోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది. జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ… సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించిన సందర్భాలు ఉన్నాయని రఘురాజును ఉద్దేశించి అన్నారు. రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని… ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారని తెలిపారు. రఘురాజుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన అంశంలో రఘురాజుపై సీబీఐ కేసు కూడా నమోదు చేసిందని తెలిపారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకునే ప్రయత్నాన్ని రఘురాజు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement