Tuesday, April 30, 2024

విశాఖ స్టీల్ – పాద‌యాత్ర‌తో ఆందోళ‌న‌కు వైసిపి శ్రీకారం..

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా వైసిపి పాద‌యాత్ర‌తో ఆందోళ‌న‌కు శ్రీకారం చుట్టింది.. ఆ పార్టీ ఎంపి విజ‌య‌సాయిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర ఉద‌యం ప్రారంభ‌మైంది. ముందుగా విశాఖ జీవీఎంసీ ఆవ‌ర‌ణ‌లో ఉన్న‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించి విజయసాయిరెడ్డి మొదటి అడుగు వేశారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అప్పలరాజు, ఎంపీలు సుభాష్‌చంద్రబోస్‌, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, గుడివాడ అమర్‌నాథ్‌‌, అదీప్‌రాజు, విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మోహన్, కన్వీనర్ కేకే రాజు, కుంబా రవిబాబు, విజయప్రసాద్‌, పంచకర్ల రమేష్‌, పసుపులేటి బాలరాజు, పార్టీ శ్రేణులు, విశాఖ నగర వాసులు, స్టీల్‌ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన వెంట కదిలారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఉదయం జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఆశీల్‌ మెట్ట జంక్షన్, సంగం శరత్, కాళీ టెంపుల్, తాటిచెట్ల పాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్, ఎయిర్‌ పోర్ట్, షీలానగర్, బీహెచ్‌పీవీ, పాత గాజువాక, శ్రీనగర్‌ మీదుగా కూర్మన్నపాలెం జంక్షన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన ఆర్చ్‌ వరకు ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 4.30 గంటలకు స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది.
ఈ సంద‌ర్బంగా విజ‌యసాయి మాట్లాడుతూ, ‌ తెలుగు జాతికి గర్వకారణమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించేందుకు పాదయాత్ర చేపట్టిన‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉక్కు ఉద్యమ పరిరక్షణ పాదయాత్ర సాగనుందన్నారు. ‘‘స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ.. ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలని సీఎం కేంద్రానికి ప్రతిపాదించారని’’ ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజానికి సంబంధించిన మైన్స్‌తో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement