Sunday, May 12, 2024

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వైసీపీ భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి.. ప‌వ‌న్‌

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వైసీపీ భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్ పై వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం… ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో కూడా నాయకులకు నేను ఒకటే చెప్పాను. పాలకులు వేరు.. ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదు. మంత్రి హరీష్ రావు ఏ సందర్భంగా వ్యాఖ్యలు చేశారో తెలియదు. దానికి ప్రతి స్పందనగా వైసీపీ నాయకులు, మంత్రులు తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడటం త‌నకు వ్యక్తిగతంగా మనస్తాపం కలిగించిందన్నారు.

దయచేసి వైసీపీ నాయకుల లకు నా విన్నపం… నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండన్నారు. సదరు తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయి అనుకుంటే ఆయన్నే విమర్శించండన్నారు. అంతేకానీ తెలంగాణ ప్రజలను వివాదాల్లోకి లాగవద్దన్నారు. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు దీనిపై స్పందించాలన్నారు. మీకు తెలంగాణలో ఇళ్లు, వ్యాపారాలు ఉన్నాయి. బొత్స లాంటి వాళ్లు ఇక్కడ వ్యాపారాలు చేసిన వాళ్లే కదా ? బొత్స కుటుంబానికి ఇక్కడ కేబుల్ వ్యాపారం ఉండేదన్నారు. దయచేసి మంత్రివర్గంలో ఎవరైనా అదుపు తప్పి మాట్లాడితే తోటి మంత్రులతోపాటు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించాలన్నారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముంద‌ని జనసేనాని స్సష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement