Monday, May 6, 2024

YCP Tour – సీమ జిల్లాల్లో రేపటి నుంచి వైసిపి సామాజిక న్యాయ బస్సు యాత్ర

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : రాష్ట్రంలో వై ఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం “వై ఏపి నీడ్స్ జగన్ ” అనే పేరుతో చేపట్టే సామాజిక బస్సు యాత్ర రాయలసీమ జిల్లాల్లో 9 చోట్ల నిర్వహించనున్నారు. తొలివిడత గా నవంబర్ 9 వ తేదీ వరకు కొనసాగే యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల లో రేపు ప్రారంభం కానున్నది.

రాష్ట్రంలో మళ్లీ అధికారం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా బస్సుయాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. ఇటీవల వైసీపీ నేతలతో చర్చించిన సీఎం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరగనున్నది. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగ‌న‌మ‌ల‌ నియోజకవర్గాల నుంచిఈ నెల 26న ప్రారంభం కానున్నది.

రాయలసీమ ప్రాంతంలో నవంబర్ 9 వరకు కొనసాగే ఈ యాత్ర శింగ‌న‌మ‌ల‌ తరువాత 27 న తిరుపతి జిల్లా కేంద్రం తిరుపతిలో , 28న కడప జిల్లా పొద్దుటూరులో, 31న కర్నూలు జిల్లా ఆదోనిలో, న‌వంబ‌ర్ 2న చిత్తూరు జిల్లాకేంద్రం చిత్తూరు లో, 3 న తిరుపతి జిల్లా శ్రీకాళ‌హ‌స్తిలో, 4 న సత్యసాయి జిల్లా ధ‌ర్మవ‌రంలో, 7న కర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డలో, 9న అన్నమయ్య జిల్లా తంబ‌ళ్లప‌ల్లెలో నిర్వహించ నున్నారు. ఆపై మరో రెండు విడతలుగా ఇతర ప్రాంతాలలో డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ 60 రోజుల పాటు యాత్రలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే ఈ యాత్ర లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు పాల్గొంటారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశంగా చెబుతున్నారు.
ఎమ్మెల్యేలు, స్థానిక స‌మ‌న్వయక‌ర్తలు ఈబ‌స్సు యాత్రకు అధ్యక్షత వహించే ఈ యాత్రకు రాయలసీమ ప్రాంత సమన్వయ కర్తలుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,కడప జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి , ఎం ఎల్ సి రామసుబ్బారెడ్డి , తిరుపతి, శ్రీకాళహస్తి కార్యక్రమాలకు ఎం పి విజయసాయి రెడ్డి, వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement