Sunday, April 28, 2024

YCP Rebels – నాలుగు వారాలు సమయం ఇవ్వండి – స్పీకర్ ను కోరిన వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు ..

అమరావతి: అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ వద్ద విచారణకు హాజ‌రైన ఎమ్మెల్యేలు త‌మ‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు మ‌రో నాలుగు వారాల గ‌డువు కావాల‌ని కోరారు.. వైసిపి రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి నేడు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఎదుట హాజ‌ర‌య్యారు.. న్యాయనిపుణులతో సంప్రదించేందుకు వీడియో, పేపర్‌ క్లిప్పింగుల వాస్తవ నిర్ధరణకు సమయం అవసరమని వారు వివ‌రించారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్‌కు విన్నవించారు.

స్పీక‌ర్ ను క‌ల‌సిన అనంత‌రం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమపై దాఖలైన పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని, అందుకు ఆయన నిరాకరించారని అందుకే నేరుగా వెళ్లి కలిశామని చెప్పారు.

తన అనారోగ్యంపై వైద్యులు నివేదిక ఇచ్చినా స్పీకర్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై మూడున్నరేళ్లపాటు పట్టించుకోని శాసనసభాపతి.. తనకు నోటీసు ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం ధ్వజమెత్తారు. తాను క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడుతున్నానని ఆరోపణలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు స్పీకర్‌ ఏమైనా ఇస్తారేమో చూస్తానన్నారు.
తాను కొవిడ్‌తో బాధపడుతున్నానని, ఇంకా సెలైన్‌ పెట్టుకుంటూనే ఉన్నానని ఉండవల్లి శ్రీదేవి వాపోయారు. వివరణ ఇవ్వడానికి స్పీకర్‌ను సమయం కోరినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement