Friday, May 3, 2024

AP: వైసీపీ నేతలు నోళ్ళు అదుపులో పెట్టుకోవాలి… బుద్దా వెంకన్న

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : వైసీపీ నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ…. తెలంగాణలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అని అన్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలు పిచ్చిగా వాగడం ఆపాలని హెచ్చరించారు. ఆడుకుందాం ఆంధ్ర ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభిస్తే, ఏపీలో ఎన్నికల కోసం తాము ఎప్పుడో ఆట ప్రారంభించామని చెప్పారు. ఆడుకుందాం ఆంధ్ర అనే కార్యక్రమం మూడు సంవత్సరాల క్రితమే కొడాలి నాని ప్రారంభించాడన్నారు. రికార్డింగ్ డాన్సులు, క్యాష్ నోస్ నడిపారన్నారు.
తర్వాత సంవత్సరం వైసీపీ నేతలు అందరూ నిర్వహించారన్నారు. కొడాలి నానిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాతే బయటికి వెళ్ళాడని గుర్తు చేశారు. కొడాలి నానిని చంద్రబాబు సస్పెండ్ చేసిన తర్వాతే వైసీపీకి వెళ్ళాడన్నారు.


తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఓట్లు వేయమని చంద్రబాబు చెప్పాడా ? అని ప్రశ్నించారు. కొడాలి నాని నోటికొచ్చినట్లు వాగుతున్నాడనీ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి.. మీ నాయకులు నోళ్లు అదుపులో పెట్టుకో అన్నారు. చంద్రబాబుపై కొడాలి నాని మాట్లాడే ప్రతి మాటా జగన్ కు వర్తించేలా మాట్లాడతామని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబం గురించి ఆయన వాగితే.. జగన్ కుటుంబం గురించి తాము స్పందించాల్సి ఉంటుందన్నారు. వాళ్ల మాటలకు మాటలతో సమాధానం చెబుతామన్నారు. కర్రలు, కత్తులు పట్టుకుంటే.. తాము అవే పట్టుకుంటాం అని తీవ్రంగా హెచ్చరించారు. ఎప్పుడైనా వాళ్లు ఎలా వచ్చినా సరే.. తాము అదేవిధంగా తిప్పికొడతామన్నారు. తెలంగాణా ఎన్నికల ఫలితాలతో మతిభ్రమించి నాని మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబుకు సత్తా ఉంది కాబట్టే.. సీఎం, పీఎంలను నిర్ణయించే స్థాయికి ఎదిగారన్నారు. గతంలో వైయస్సార్ ను కూడా నాని ఇలాగే తిట్టాడని చెప్పారు. ఎన్టీరామారావు, వైయస్ లు ఎప్పుడూ కలిసి లేరన్నారు. వారిద్దరూ రాజకీయ శత్రువులే అని తెలిపారు. కొడాలి నాని నాలుక.. ఎటు తిరిగితే అదే వాగుతున్నాడన్నారు. తెలంగాణా ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వీసాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రం వదిలి విదేశాలు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. కొంతమంది భారతదేశం వదిలి ఎక్కడకి వెళ్లినా.. మిమ్మల్ని లాక్కు వస్తామని హెచ్చరించారు. మీరు చేసిన తప్పులకు తప్పకుండా కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు.

పోటీ చేసే అంశంపై స్పందించిన బుద్దా వెంకన్న..

- Advertisement -

టీడీపీ బీసీల పార్టీ.. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తా.. ఇది ఆప్షన్ ఏ గా తెలిపారు. పొత్తుల వల్ల కాదంటే. చంద్రబాబు మాటలను కాదని ముందుకు వెళ్లనన్నారు. ఆయన నాకు దైవంతో సమానం.. ఆయన చెప్పినట్లే నడుచుకుంటానని తెలిపారు. అయితే ఆప్షన్ బీ మరోకటి ఉందన్నారు. తాను ఇక్కడ స్విచ్ వేస్తే.. ఆ జిల్లాలో లైట్లు వెలుగుతాయన్నారు. చంద్రబాబు శ్రీరాముడు అయితే.. తాను హనుమంతుడిని.. సీటు తప్పకుండా అడుగుతానన్నారు. అడగకుండా అమ్మ అయినా అన్నం పెట్టదనేది వాస్తవం కదా అన్నారు. బీసీగా తనకు తప్పకుండా ఎమ్మెల్యే సీటు ఉంటుందనేది తన విశ్వాసమన్నారు. టీడీపీ కోసం నిలబడిన నలుగురైదుగురిలో బుద్దా వెంకన్న అనే వ్యక్తి ముందు ఉంటాడన్నారు. చంద్రబాబు కుటుంబంపై ఈగ వాలకుండా ముందు నిలబడిన వ్యక్తిని తాను అన్నారు. మాచర్లలో తురగా కిషోర్ అనే వ్యక్తి తనపై కర్రతో దాడి చేశాడన్నారు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకు వస్తే.. ఎదురొడ్డి నిలబడ్డా అని తెలిపారు.


కొడాలి నాని నోటికొచ్చినట్లు కూస్తున్నా.. తాను అతన్ని నిలదీశానన్నారు. పొత్తులు ఉన్నాయి కాబట్టి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆప్షన్ ఏ ప్రకారం తన నియోజకవర్గంలో ఇవ్వకుంటే.. ఆప్షన్ బీ అయినా అమలు చేయాలని కోరతా అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తప్పకుండా ఏదొక సభలో తాను అడుగు పెడతానన్నారు. రానున్నది చాలా క్లిష్ట పరిస్థితి.. డబ్బు, కులం కన్నా.. తన పక్కన నిలబడే నాయకుడు ఎవరని చూసుకోవాలనీ సూచించారు. 23 మంది టీడీపీలోకి వస్తే.. ఆ తర్వాత కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారన్నారు. ఇప్పుడు తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారెవ్వరూ రేపు ఎన్నికల్లో గెలవరన్నారు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు.. పార్టీ కోసం పని చేసే వారిని నాయకులు కూడా గుర్తించాలన్నారు. చంద్రబాబు తనను తప్పకుండా చట్ట సభల్లోకి తీసుకెళతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement