Sunday, May 12, 2024

తెల్ల‌రాయికి రెక్క‌లు – మాఫియాకు అధికారుల అంద‌దండ‌లు..

అమరావతి, ఆంధ్రప్రభ, బ్యూరో: ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులే బక్షకులుగా మారుతున్నారు. విలువైన ఖనిజ సంపదను కంటికి రెప్పలా భద్రత కల్పించాల్సిన ఆయా శాఖల అధికారులు మాఫియాతో చేతులు కలిపి మామూళ్లు పంచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక, గ్రావెల్‌, ఎర్రమట్టి, కొండ రాళ్లు వంటి ప్రకృతి సంపదలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అరుదుగా లభిస్తున్న అత్యంత విలువైన తెల్లరాయిని కూడా కొంతమంది ఘనులు కొల్లగొడుతూ కోట్లు దోచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయా జిల్లాల పరిధిలోని స్థానిక అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారే తప్ప విలువైన సంపదను దోచుకుంటున్న మాఫియాపై కనీసం చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు పెద్దఎత్తున గండి పడుతుంది.

తెల్లరాయికి గిరాకీ
ప్రత్యేకించి నెల్లూరు, ప్రకాశం సరిహద్దు జిల్లాల్లో లభించే తెల్లరాయికి పొరుగున ఉన్న చెన్నై, బెంగళూరు వంటి మహాన గరాల్లో మంచి గిరాకీ ఉండడం, తెల్లరాయి పొడిని వివిధ రకాల ఔషధాలతో పాటు అత్యంత ఖరీదైన గ్రానెట్‌ రాయిని తయారు చేయడానికి కూడా తెల్లరాయి పొడిని ఉపయోగిస్తుంటారు. అందుకు సంబంధించిన పరిశ్రమలు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఏపీకి చెందిన కొంతమంది మాఫియాగా ఏర్పడి తెల్లరాయిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం రాష్ట్రం నుంచి 5 నుంచి 10 లారీల వరకు తెల్లరాయి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుందంటే అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో తెల్లరాయి త్రవ్వకాలు ఏ మేరకు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా ప్రాంతాలకు చెందిన వివిధ శాఖల అధికారులకు నెల మామూళ్లతో పాటు ప్రతి లోడుకు కొంత మొత్తం ముట్టజెప్పి రాజమార్గంలోనే తెల్లరాయిని సరిహద్దులు తరలించేస్తున్నారు.

కోట్లలో దోపిడీ
రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలో విలువైన ప్రకృతి సంపద ఉంది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో కొండరాయితో పాటు విలువైన గ్రావెల్‌ను కూడా ఇష్టానుసారం దోచేస్తున్నారు. ప్రతీ జిల్లా పరిధిలో ఇసుక నుంచి మట్టి వరకు ఏదీ వదిలిపెట్టకుండా నిత్యం వందలాది లారీలు, ట్రాక్టర్లలో త్రవ్వకాలు జరిపి బహిరంగంగానే విక్రయిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువైన సంపదను మాఫియా కొల్లగొడుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం అటువైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులు ఫిర్యాదు చేసినా కూడా కొంతమంది అధికారులు స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో మాఫియాదే ఇష్టారాజ్యం అయిపోతుంది. నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు, ప్రకాశం జిల్లా పరిధిలోని పామూరు, సీ.ఎస్‌ పురం తదితర మండలాల పరిధిలోని కొండ కింద ప్రాంతాల్లో తెల్లరాయిని నిత్యం అక్రమంగా తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాలు పూర్తిగా వెనుకబడినవి కావడం, గ్రామాల పరిధిలోని ప్రజలు ఆర్థికంగా నిరుపేదలు కావడంతో వారికి రోజువారి కూలీ ఇచ్చి యంత్రాలతో సమీపంలోని కొండ కింద ప్రాంతాల్లో త్రవ్వకాలు జరుపుతున్నారు. అదే రాయిని స్థానికుల చేత భారీ లారీల్లో లోడ్‌చేసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 20 నుంచి 30 టన్నుల తెల్లరాయిని సేకరించడానికి మాఫియాకు రూ.10 నుంచి 20 వేలు మాత్రమే ఖర్చవుతుంది. అదే రాయిని తమిళనాడు, కర్ణాటకకు సరఫరా చేస్తే లోడుకు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. అదే ఆదాయం నుంచి ప్రతీ లోడుకు రూ.25 వేలు నుంచి రూ.50 వేలు వరకు స్థానిక అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. దీంతో అన్ని ఖర్చులు పోను మాఫియాకు లోడుకు రూ.లక్షకు పైగా మిగులుతుంది. నిత్యం 5 నుంచి 10 లోడ్‌లు రవాణా చేస్తుండడంతో రోజుకు రూ.10 లక్షలకు పైగా అర్జిస్తున్నారు. దీంతో మాఫియా కన్ను పై రెండు జిల్లాలపై పడింది.

అందరికీ ఆమ్యామ్యాలు
రాష్ట్రంలో జరుగుతున్న ప్రకృతి సంపద దోపిడీలో అత్యధికంగా మైనింగ్‌ఒ శాఖ తర్వాత రెవెన్యూ, ఫారెస్టు, పోలీసులకు పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నాయి. అందుకే జాతీయ రహదారులకు సమీపంలో ఉండే పోలీస్‌స్టేషన్‌లకు, ఇతర కార్యాలయాలకు సంబంధించి బదిలీపై వెళ్లేందుకు ఆయా శాఖ అధికారులు పోటీ పడుతుంటారు. అందుకోసం అవసరమైతే పోస్టింగ్‌ కోసం లక్షలు వెచ్చిస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆ సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు మాఫియాతో చేతులు కలిపి అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఇచ్చి పుచ్చుకునే ధోరణి అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు తెలిసినా మొక్కుబడిగా తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారే తప్ప మాఫియాకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న అవినీతి రుచి మరిగిన అధికారులపై మాత్రం కొరడా రులిపించలేకపోతున్నారు. ఫలితంగా దోచుకో..దాచుకో అన్న శైలిలో అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడంలో తెరవెనుక పాత్ర పోషిస్తూ ప్రభుత్వ ఖజానాకు దగ్గరుండి గండి కొడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement