Sunday, April 28, 2024

AP : వైకాపాకు వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారా లోకేష్‌

శ్రీ సత్యసాయి బ్యూరో,మార్చి 8( ప్రభ న్యూస్) : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టిడిపి, జనసేన కూడిమికి అధికారం ఖాయమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించడం డబల్ ఖాయమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వ కాలంలో, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని జగన్ సిద్ధంగా ఉన్నాడా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు.

- Advertisement -

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలో శుక్రవారం శంఖారావం బహిరంగ సభ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 120 సంక్షేమ పథకాలు రద్దు చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేకపోయారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రజల ముందుకు రాలేక పరదాల రక్షణలో తిరుగుతున్నారని లోకేష్ విమర్శించారు. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పుకుంటున్న జగన్ తన చెల్లి, తల్లి కి అన్యాయం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.

తన నాన్న వివేకానంద రెడ్డిని జగన్, అతని అనుచరులే చంపించారని జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి కూతురు సునీత బహిరంగంగా చెబుతున్న ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. ప్రపంచంలోనే జగన్ లాంటి ఉన్మాది ఎక్కడ ఉండరని, ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నుకోవడం వల్ల రాష్ట్రం 20 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి పోయిందన్నారు. పాలిచ్చే ఆవులు వదులుకొని, తన్నే దున్నపోతును ఎన్నుకున్నారని నారా లోకేష్ అన్నారు. దేశానికే సంక్షేమ పథకాలను పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందని, జగన్మోహన్ రెడ్డి నిక్కర్లు వేసుకున్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారన్నారు. ఒక చేత్తో డబ్బులు ఇస్తూ మరో చేత్తో రెట్టింపు లాక్కుంటున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య పాన నిషేధం చేస్తానని, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకపోగా విషపూరిత మద్యాన్ని అమ్ముతూ ప్రజలను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే టిడిపికి ఎంతో ప్రాణం కావున అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ స్థాపించడానికి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారన్నారు. హంద్రీనీవా కాలవ నిర్మాణం పూర్తి చేశామని అందుకే అనంతపురం జిల్లాలో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ కు టిడిపి హయాంలో రూ .1000 కోట్లు ఖర్చు పెట్టామని, హార్టికల్చర్ హబ్బుగా మార్చామన్నారు. అరటి రైతులకు రెట్టింపు ఆదాయం తెచ్చామని, కానీ జగన్మోహన్ రెడ్డి అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో కరువు ఉన్నా కరువు జిల్లాలుగా ప్రకటించకపోవడం విశారకరమన్నారు. కరువు జిల్లాలుగా ప్రకటించి తక్షణమే ఉపాధి పనులు ప్రారంభించి, రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు రెండువేల కోట్లు ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు భయపడాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తిని టూరిజం హబ్బుగా మారుస్తామన్నారు.

శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జన్మించిన పుట్టపర్తి ప్రశాంతతకు మారుపేరని కానీ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వల్ల ఇక్కడ ప్రశాంతత దెబ్బతిని దౌర్జన్యాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొత్తచెరువు, పుట్టపర్తి బుక్కపట్నం లను కలుపుతూ రింగ్ రోడ్ వేస్తామని హామీ ఇచ్చారు. కప్పల బండ దగ్గర గల ఏపీఐఐసీలో పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. వైకాపా పాలనలో కొందరు అధికారులు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. బ్యాంకులను మోసం చేసిన ఘనత పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికే దక్కుతుందని ఇలాంటి వ్యక్తి ప్రజలను మోసం చేయడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన బాధ్యత టిడిపి నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పై లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు.

పవన్ కు లోకేష్ ప్రశంసలు…
చంద్రబాబు అరెస్టు తర్వాత మొదటి ఫోన్ పవన్ దగ్గర నుంచి వచ్చింది:-
టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ను అక్రమ కేసులో పోలీసులు అరెస్టు చేసిన తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నుంచి తనకు మొదటి ఫోను వచ్చినట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ సభలో పేర్కొన్నారు. అధైర్య పడవద్దు నేనున్నానంటూ ధైర్యం చెప్పాడని, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ను కొనియాడారు. టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

1984 చరిత్రలో నిలిచిన సంవత్సరం…

కొత్తచెరువు ఎప్పటికీ మరువలేము:-1984వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ రామ్ లాల్ సహకారంతో కూల్చినప్పుడు మొట్టమొదట ఆందోళన కొత్తచెరువులోని ప్రారంభమై పోలీస్ కాల్పుల్లో ఇద్దరు మరణించడం జరిగిందని, ఇలాంటి కొత్తచెరువు ప్రాంతాన్ని తాము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామన్నారు. కొత్తచెరువుకు ఎంతో రుణపడి ఉన్నామని ఆయన బహిరంగ సభలో ప్రకటించారు.

20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం:
టిడిపి జనసేన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. బీసీ లలో 50 సంవత్సరాలు నిండిన వారికి ₹4,000 పింఛన్ అందిస్తామన్నారు. 5000 కోట్లతో బీసీలకు ఆదరణ పనిముట్లు అందిస్తామని, చంద్రన్న బీమా ను పది లక్షల రూపాయలు పెంచుతామని, బీసీల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామన్నారు.
కేసులు ఎత్తివేస్తాం…
అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎత్తివేస్తాం:-టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల పైన విచారణ జరిపి ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement