Sunday, May 5, 2024

AP: ఏపీలో ఎప్ప‌టికైనా అధికారంలోకి వ‌స్తాం.. డీకే శివకుమార్

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఏపీలో ఎప్ప‌టికైనా అధికారంలోకి వ‌స్తామ‌ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రత్యేక హోదా, రాజధాని, ఏపీ అభివృద్ధి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఏపీ సీసీ కార్యాలయానికి వచ్చిన కర్నాటక డిప్యూటీ సీఎం కుమార్ కు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్ర‌రాజు, రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ ఇతర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ… నిన్న తెలంగాణ ఎన్నికల‌ ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారునీ చెప్పారు. కాంగ్రెస్ వేవ్ అక్కడ నడుస్తుంది.. సోనియా పై‌ విశ్వాసంతో ఉన్నారన్నారు.

రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమ‌ని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఏదో ఒక‌రోజు తప్పకుండా అధికారంలోకి వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తప్పకుండా ఏపీ ప్రజలు కాంగ్రెస్ నే ఆదరిస్తారన్నారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు, మంత్రులుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందరూ ఇలా ఎదిగిన వారే అని గుర్తు చేశారు. కుర్చీ కావాలంటే కుర్చీ కోసం పోరాడాలన్నారు. పని చేసేవాడిని జాగ్రత్తగా చూసుకుంటే పార్టీ బలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ చరిత్ర దేశ చరిత్ర అన్నారు. పాలిటిక్స్ లో ఎవరూ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాజధాని అంశం, ప్రత్యేక హోదా, అభివృద్ధి అంశాలపై కాంగ్రెస్ ఏపీకి కమిట్మెంట్ ఇచ్చిందన్నారు. దానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటామన్నారు. జాతీయ పార్టీలు యాక్టివ్ గా లేకపోవడం ఏపీలో అభివృద్ధి లేకపోవడానికి కారణం గా కనిపిస్తుందన్నారు. ఇండియా కూటమిగా మనతో 26 పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ కారణంగా దేశం సంయుక్తంగా ఉందన్నారు. నమ్మకాన్ని కోల్పోవద్దు… సమస్యలపై పోరాడండని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కలిసి ఆలోచించి పనిచేయాలి… అదే గెలుపు కారణంగా ఉంటుందన్నారు.

జగన్మాత సేవలో డీకే శివకుమార్..
ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. అమ్మవారి ఆలయానికి శనివారం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం డీకే శివకుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు డీకే శివకుమార్ కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ చంద్రశేఖర్, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య, వేద పండితులు, పురోహితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement