Thursday, May 16, 2024

Bonda Uma vs Padma: నువ్వు ‘ఒరేయ్‌’ అంటే మేం ‘ఒసేయ్‌’ అనలేమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మ తీరు హేయంగా ఉందన్నారు. మహిళా చైర్ పర్సన్‌గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా? అని ప్రశ్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని నిలదీశారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారన్నారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు స్పందించిందే లేదని స్పష్టం చేశారు. దీనిపైన తాము న్యాయ పోరాటానికి సిద్ధమని బోండా ఉమ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటోందని ఆరోపించారు. తూ తూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు తాము అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే బాధితురాలి శీలాన్ని రూ.10 లక్షలకు వెలకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నువ్వు అరేయ్‌ అంటే మేం ఒసేయ్‌ అనలేమా? అని బోండా ఉమ వ్యాఖ్యానించారు. జగన్‌ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేశారని అన్నారు. తమ ప్రజాపోరాటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. మేకప్‌ వేసుకొని ఆస్పత్రికి వచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతోనే మాకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మను పదవి నుంచి తొలగించేవరకు న్యాయపోరాటం చేస్తామని బోండా ఉమ స్పష్టం చేశారు. కాగా, సోమవారం విజయవాడ అత్యాచార బాధితురాలు, తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు బోండా ఉమ వినతి పత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement