Monday, April 29, 2024

రైల్వే విద్యుత్ లైన్ పై వానరం మృతి – విశాఖ రూట్ లో రైళ్ల రాక‌పోక‌లకు అంత‌రాయం..

సామర్లకోట, : కాకినాడ జిల్లా సామర్లకోట-వేట్లపాలెం రైల్వేస్టేషన్ల మధ్య శ విద్యుత్‌ లైనులో తలెత్తిన సాంకేతిక లోపంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సామర్లకోట రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. హుస్సేన్‌పురం-గూడపర్తి మధ్య వెంకటరామా ఆయిల్‌ పరిశ్రమ సమీపంలో ఓ వానరం రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగపై పడి మృతిచెందడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే అప్‌లైన్‌లో రైళ్లకు అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ కారణంగా సామర్లకోట రైల్వేస్టేషన్‌తో పాటు అవుటర్‌లో కొన్ని రైళ్లను నిలిపేశారు. ఇంజినీరింగ్‌ అధికారులు అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.06 గంటలకు సామర్లకోట రావాల్సిన విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 3.56కు వచ్చి, రెండు గంటలు నిలిచిపోయింది. బెంగళూరు-భువనేశ్వర్‌ (18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు 3.33 గంటలకు రావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా 4.05 గంటలకు వచ్చింది. ఈ రైలును సాయంత్రం 5.54 గంటలకు పంపించారు. హావ్‌డా-ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12863) సూపర్‌ఫాస్ట్‌ రైలు మధ్యాహ్నం 2.34కు రావాల్సి ఉండగా అవుటర్‌లో నిలిపివేయడంతో సాయంత్రం 5.10కు వచ్చి, 6.02 గంటలకు వెళ్లింది. తర్వాత తిరుమల ఎక్స్‌ప్రెస్‌, చెన్నై మెయిల్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. .

Advertisement

తాజా వార్తలు

Advertisement