Monday, April 29, 2024

మోడీజీ …ముందు మీ స‌ర్కార్ ని ర‌ద్దు చేయండి … కార్మిక నేత‌ల డిమాండ్

ఉక్కుపోరాటం మరింత పదును తేలింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతు, కార్మిక శంఖారావం ఆదివారం ప్రతిధ్వనించింది. భారీ ర్యాలీలో భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. ముందుగా మోడీ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఆ తర్వాతే ప్రైవేటీకరణ అజెండాతో ఎన్నికలకు రావాలని నేతలు సవాల్‌ చేశారు. ఉద్యోగులు, రైతు కార్మికుల ఉద్యమంతో విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఉపసంహరించుకోక తప్పదని, లేదంటే ఆందోళనలు దేశవ్యాప్తమవుతాయని హెచ్చరించారు.

విశాఖపట్నం : దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేయాలని చూస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, ప్రైవేటీకరణ అజెండాను ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్లాలని జాతీయ స్థాయి రైతు, కార్మికసంఘాల నేతలు సవాల్‌ చేశారు. కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసేలా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, వీటిని ఎదిరించి బుద్ధి చెబుతామని వారు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకు నేందుకు సంయుక్తపోరాటం చేస్తామని, దేశంలో వ్యవసాయ ఉద్యమానికి ఈ పోరాటం స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘాల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలకు నిరసనగా రైతు కార్మిక శంఖారావం బహిరంగ సభ ఆదివారం సాయంత్రం విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌వద్ద జరిగింది. బీచ్‌ రోడ్డు లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ర్యాలీగా ప్రారంభమై ఆర్కే బీచ్‌ వరకూ సాగిన ర్యాలీలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ నాయకులు రాకేష్‌ సింగ్‌ తికాయత్‌, ఆలిండి యా కిసాన్‌ సభ జాతీ నాయకులు అశోక్‌ ధావలె, ఆలిండియా అగ్రికల్చర్‌ వర్కర్స్‌ యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, కిసాన్‌ సభ జాతీయ నాయకులు బల్‌ కరన్‌ సింగ్‌, ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌లు సీహెచ్‌ నరసింగరావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌లు, కమిటీ కన్వీనర్‌ జె. అయోధ్యరాం, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ కమిటీ తరపున రాష్ట్ర జిల్లా నాయకులు, వివిధ కార్మిక సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, ఈస్టిండియా కంపెనీ స్వతంత్య్రానికి పూర్వం 200 ఏళ్లు పాటు పాలించి భారత దేశాన్ని విదేశీయుల కబంధ హస్తాల్లో బాధించినట్లే ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా స్టీల్‌ప్లాంట్‌ను పోస్కో కంపెనీకి అప్పగించి అదే పరిస్థితిని పునరావృతం చేస్తున్నారంటూ ఆరోపించారు.
కేంద్రం దిగివస్తుంది: తికాయత్‌
భారతీయ కిసాన్‌ యూనియన్‌ రాకేష్‌ సింగ్‌ తికాయత్‌ మాట్లాడుతూ, లక్షలాది మంది ఉద్యోగుల రైతుల ఆందోళన మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేస్తూ, దేశీయ రంగాలను విక్రయించేందుకు సిద్ధప డుతున్నరాని మోదీ ప్రభుత్వంను నిలదీసారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ఎలాంటి బెరుకూ అక్కరలేదన్నారు. ఢిల్లిdలో చేస్తున్న రైతుల పోరాట దీక్ష ఇందుకు ఉదాహరణగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వం దిగి వచ్చి తీరుతుందని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించే ఆలోచనలో ఉన్న మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే తీరుతామన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం చారిత్రాత్మకం అని ఆయన భావించారు. ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షులు అశోక్‌ ధావలె మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు గులాం అయిపోతోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం టెలికం, రైల్వే, బీమా రంగం, ఇలా అన్నిటినీ ప్రయివేట్‌ పరం చేసి దేశాన్ని ధనవంతుల పరం చేసేందుకు చూస్తోందని, వారికి సహాయం చేస్తూ ఎన్నికల్లో తాను వారి ఆర్ధిక సహాయంతో పదవులు పట్టాలన్న లక్ష్యంతో ఉన్నారని ఆరోపించారు. ఆలిండియా అగ్రికల్చర్‌ వర్కర్సు యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి దేశంలోని అన్ని కార్మిక , రైతు, మేధావుల సంఘాలూ అండగా ఉన్నాయన్నారు. ఢిల్లిdలో 143 రోజులుగా జరుగుతున్న రైతు పోరాటానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు తమ జీతాల్లోంచి వెచ్చించి ఆర్థిక మద్దతు దేశంలోనే అత్యధికంగా పంపారని గుర్తు చేశారు. కేంద్రం సహాయం లేకపోయినా స్వయం సమృద్ధి సాధించిందని చెబుతూ ఉక్కు ఉద్యమంలో మోదీ మసికాకతప్పదని భావించారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అతి చౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు పూనుకోవడాని ్న తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.అదాని వంటి సంస్థ 40 వేల కోట్ల ఆస్థులను 3.30 లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు పెంచుకోవడం వెనుక మోదీ సహకారమే కారణమన్నారు. కిసాన్‌ సభ జాతీయ నాయకులు బల్‌ కరన్‌ సింగ్‌ మాట్లాడుతూ నష్టాలను సాకుగా చూపి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేట్‌కు కట్టబెట్టే ందుకు సిద్ధమైన మోదీ ప్రభుత్వం తనకు ఎన్నికల్లో ఆర్థికంగా నిలబడే వారికి వేల లక్షల కోట్ల రూపాయల ఇన్‌కంటాక్సు చెల్లించకుండా మాఫీ చేస్తారంటూ ఎద్దేవా చేశారు.

ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలి: వడ్డే
ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పారు. పార్లమెంట్‌లో మంచి మెజార్టీతో గెలిచామనే అహంతో పరిశ్రమలను ప్రయివేట్‌పరం చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. మోదీ అన్నీ ప్రయివేట్‌కు ఇచ్చేసే ఆలోచనే అమలు చేయాలంటే, అదే నినాదంతో కేంద్రంలోని ప్రభుత్వంను రద్దు చేసి, ఇదే నినాదంను అజెండగా ఎన్నికలకు వెళ్లి గెలిచి చేసుకోవాలన్నారు. ఇతర నాయకులు కె. కేశవరావు దడాల సుబ్బారావు, రావుల వెంకయ్యయ, పి. జమలయ్య తదితరులు మాట్లాడిన సభలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌లు సీహెచ్‌ నరసింగరావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్లు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ ప్రాంతాల వారీ సదస్సులను ఇక మీదట జరిపి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement