Monday, April 29, 2024

మ‌హా విశాఖ … అప్పుల కుప్ప‌..

గ్రేటర్‌కు రూ.532 కోట్ల రుణభారం
వివిధ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం రూ.100 కోట్లు పైమాటే
ప్రభుత్వం వద్ద రూ.145 కోట్లు గ్రేటర్‌ నిధులు
బీపీఎస్‌ కింద మరో రూ.70 కోట్లు అక్కడే ఆ మొత్తం తిరిగిస్తే కోలుకునే అవకాశం
విశాఖపట్నం, : పరిపాలనా రాజధాని విశాఖలో మహావిశాఖ నగరపాలక సంస్థ సేవలు అత్యంత కీలకం. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్‌గా పేరుపొందిన జీవీఎంసీ గత కొద్ది నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. అయితే ఇందుకు అనేక సాదారణ అభివృద్ధి పనులు, కీలకమైన ప్రాజెక్టుల పనులు చేపట్టడం ప్రధాన కారణం కాగా, మరో వైపు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, కార్మికులకు, పరిపాలన విభాగం ఖర్చులకు ఇలా అన్నీ కలిసి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం మరో కారణం. ప్రస్తుతం జీవీఎంసీ పరంగా సుమారు రూ.532 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ సంస్థలకు, కాంట్రాక్టర్ల బకాయిలు జీవీఎంసీ నెలలు తరబడి చెల్లించడం లేదు. 2019 సెప్టెంబర్‌ నుంచి నేటి వరకు సుమారు రూ.402 కోట్లకు పైగా బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.302 కోట్లు బిల్లులు పెండింగ్‌ ఉండగా, మరో వంద కోట్లు బిల్లులు వివిధ విభాగాల్లో పెండింగ్‌ ఉన్నాయి. ఇలా కేవలం అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకే సుమారు రూ.402 కోట్లు బిల్లులు బకాయి ఉంది. వీటిలో సగమైన చెల్లించాలని చాలా కాలంగా కాంట్రాక్టర్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. నగరానికి వచ్చిన ముఖ్య ప్రజా ప్రతినిధులకు తమ బిల్లులు చెల్లింపునకు చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ వినతిపత్రాలు అందిస్త్తోంది. వీటితో పాటు ఎస్‌సి, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పనులు కింద మరో రూ.40 కోట్లు వరకు బిల్లులను కాంట్రాక్టర్లకు గత రెండు సంవత్సరాలుగా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం రూ.40 కోట్లు వరకు పెండింగ్‌ ఉందని కాంట్రాక్టర్లు చెబుతుండగా అధికారులు మాత్రం రూ.30 కోట్లు పెండింగ్‌ ఉందని వాదిస్తున్నారు. వీటితో పాటు జీవీఎంసీ దశల వారీగా పలు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో వడ్డీకి రుణాలు తీసుకుంది. ఇందులో హడ్కో సంస్థ నుంచి అత్యధికంగా రూ.240 కోట్లు, ఐసిఐసిఐ నుంచి రూ.50 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌ఐసి సంస్థల నుంచి దశల వారీగా రూ.479.67 కోట్లు రుణం తీసుకుంది. 2019 మే 24 నాటికి ఇంకా రూ.199.64 కోట్లు వివిధ సంస్థలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సుమారు రూ.100 కోట్లు పైనే ఇంకా రుణాలు చెల్లించాల్సి ఉంది. ఇలా జీవీఎంసీకి తక్కువలో తక్కువుగా సుమారు రూ.532 కోట్ల వరకు అప్పులున్నాయి. మరో వైపు ఆయా విభాగాల నుంచి సమకూరుతున్న ఆదాయం కేవలం ప్రతీ నెల ఖర్చులకే సరిపోతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరిట అత్యధిక నిధులను దుబారాగా ఖర్చు చేస్తున్నారు.
ఆ నిధులు తిరిగి ఇవ్వాలి
సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఖాతాలో గ్రేటర్‌ నిధులు రూ.145 కోట్లు, బీపీఎస్‌ కింద రూ.70 కోట్లు జీవీఎంసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన సర్‌ చార్జిలు, స్టాంప్‌ డ్యూటీ మొత్తంతో పాటు ప్రజలు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న ఫీజులు, బకాయిలు ఇలా అనేక పద్దుల కింద నేరుగా సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ఖాతాలోకి జమ అవుతున్నాయి. గత కొద్ది నెలలుగా ఇక్కడ స్థానిక జీవీఎంసీ ఖాతాలకు కాకుండా అమరావతి ప్రధాన కార్యాలయం సిీఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఖాతాలో ఈ మొత్తం జమ కావడం జరుగుతుంది. ఇలా ఇప్పటి వరకు జీవీఎంసీకి చెందిన నిధులు సుమారు రూ.145 కోట్ల వరకు సిఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఖాతాలోనే జమ అయినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ మొత్తాన్ని విశాఖలో ట్రెజరీ కార్యాలయం ద్వారా తిరిగి జీవీఎంసీకి చెల్లించాల్సి ఉంది. సిఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఖాతా నుంచి ఈ మొత్తం విడుదల కావాల్సి ఉంది. వీటితో పాటు మరో రూ.70 కోట్ల వరకు బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ (బీపీఎస్‌) మొత్తం కూడా సీడీఎమ్‌ఎ ఖాతాలో పెండింగ్‌లో ఉంది. ఆ రూ. 225 కోట్లు చెల్లించాలని జీవీఎంసీ ఉన్నతాధికారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement