Saturday, May 11, 2024

సేవ భారతీయ సంస్కృతిలో భాగం:  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సేవ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, ప్రతి ఒక్కరూ సమాజంలో పదిమందికి సాయపడేలా జీవించాలని, అప్పుడే మన జీవితానికి సార్థకత చేకూరుతుందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్బోధించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరు విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. బుధవారం ఉదయం అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు గ్రామంలో నెలకొల్పిన దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. తొలుత ట్రస్ట్ కు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతికి ట్రస్ట్ చైర్మన్ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ ఆవరణలోని డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించి దేవిరెడ్డి శారదమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి ట్రస్ట్ ఆవరణలోని హైస్కూల్, ఆస్పత్రిని సందర్శించారు. హైస్కూల్లోని చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేవి రెడ్డి కుటుంబ సభ్యులు గొప్ప సేవా భావంతో నెలకొల్పిన ట్రస్టును ప్రారంభించడం, సందర్శించడం, పరిశీలించడం తన మనసుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తమ ఆస్తులను అందించి ఆనందపడతారని, ఆస్తులు పంచడంతోపాటు మంచితనం, మానవత్వం, సమాజ హితం పట్ల బాధ్యతను వారసత్వంగా అందించగలిగితే మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు పది కాలాల పాటు పదిలంగా ఉంటాయన్నారు. జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన ఊరును, మాతృభాషను ఎప్పుడూ మర్చిపోకూడదని, మాతృ దేశం సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరైతే సొంత లాభం కొంత మానుకుని ఇతరులకు సాయపడతారో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రతి ఊరిలో ఒక విద్యాలయం, ఒక గ్రంధాలయం, ఒక దేవాలయం, ఒక సేవాలయం చాలా అవసరమన్నారు. తమ తమ గ్రామాల్లో ఇవన్నీ కల్పించేందుకు ఆర్థికంగా స్థిరపడిన వారు తమ వంతు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో తను సంపాదించిన సంపదను ఇతరులతో పంచుకోవడం అనేది ప్రకృతి  ధర్మమని,  రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో  ఈ ప్రస్తావనలు అనేకం ఉన్నాయని, పాశ్చాత్య వ్యామోహం ఎక్కువై మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోతున్నామని, మన పిల్లలకు కూడా రామాయణ, మహాభారతం పట్ల అభిరుచి కల్పించాలని, విధిగా చదివించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి తో కలిసి జీవించాలని, మొక్కలను విరివిగా పెంచాలని పిలుపునిచ్చారు.  దేశానికి కావాల్సింది అభివృద్ధి ఒక్కటే కాదని, ప్రజలకు శాంతి కావాలని, ఏ దేశంలో ప్రజలకు సంతోషం, శాంతి, తృప్తి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశమన్నారు. మనదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చక్కటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్కరు ఈ విధానాన్ని ఆచరించాలని కోరారు. ఈ సందర్భంగా ఈ ట్రస్టులో ఏర్పాటు చేసిన అత్యాధునిక విద్య, వైద్య, ఇతర సేవా కార్యక్రమాలను చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవస్థాపకులు, మేనేజింగ్ ట్రస్టీ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ శ్రీ విజయరావు, కావలి  శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement